గోదావరిలో మునిగి ఒకరు..
జన్నారం: బంధువుల కర్మకాండకు వెళ్లివస్తూ గో దావరిలో మునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుందారపు లక్ష్మీనారాయణచారి (55) ఆదివారం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం జైనా గ్రామంలోని బంధువుల ఇంట్లో కర్మకాండకు తన బాబయ్ చంద్రయ్యతో కలిసి తిమ్మాపూర్ గోదావరి నది దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లక్ష్మీనారాయణచారి మడుగులో నీటమునిగాడు. గమనించిన చంద్రయ్య రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలితం లేదు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి యువకుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య పుష్పలత, కుమారులు వెంకటచారి, రాజుకుమార్ ఉన్నారు.
బాసర గోదావరిలో ..
బాసర: బాసర గోదావరినది లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తిమృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు పింక్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపుకార్డు, చిరునామా కలిగిన ఆనవాళ్లు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చుక్కలదుప్పి మాంసం పట్టివేత!
చెన్నూర్‌రూరల్: ఆదివార్‌పేట శివారులోని పత్తి చేనులో చుక్కలదుప్పిని హతమార్చి మాంసాన్ని తరలిస్తున్న వ్యక్తులను ఆదివారం రాత్రి చెన్నూర్ అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. దుప్పి మాంసంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.


