‘జీవో 229ని వ్యతిరేకిస్తున్నాం’
మంచిర్యాలటౌన్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా తీసుకువచ్చిన జీవో 229ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), హెల్త్‌కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్డీఏ) మంచిర్యాల విభాగ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ కౌన్సిల్ అనేది ఒక స్వంతంత్ర చట్టబద్ధమైన సంస్థ అని, ప్రభుత్వ అధి కారుల జోక్యం పెరగడంతో కౌన్సిల్ వృత్తిపరమైన స్వేచ్ఛ, నిర్ణయాధికారం పూర్తిగా దెబ్బతింటాయన్నారు. కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్య 25 నుంచి 29కి పెంచడం ద్వారా ఇబ్బందులుంటాయని, వైద్య, విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ లాంటి అంశాలపై వైద్యార్హత లేని ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం టీజీఎంసీ నకిలీ వైద్యులపై కఠినచర్యలను తీసుకుంటున్న తరుణంలో జీవో 229ని తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన, ప్రజా స్వామ్య మార్గాల్లో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సంతోష్ చందూరి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రసాద్, హెచ్‌ఆర్డీఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ ముత్తినేని, వైద్యులు పాల్గొన్నారు.


