ఇక మున్సి‘పాలిటిక్స్’..
● కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు ● పోటీకి సై అంటున్న ఆశావాహులు ● పార్టీ పెద్దల వద్ద జోరుగా పైరవీలు ● రిజర్వేషన్ల కోసమే ఎదురుచూపులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేయాలని ఆశావహులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించారు. ఓ డివిజన్‌కు చెందిన ఓట్లు మరో డివిజన్‌లోకి వెళ్లడంపై ఇప్పటికే 100 వరకు అభ్యంతరాలు వచ్చాయి. ఆశావహులు స్వయంగా ఓటరు జాబితాను పరిశీలించి ఏయే ఓట్లు ఇతర డివిజన్‌లోకి వెళ్లాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ఓటర్లతో మాట్లాడి అభ్యంతరాలను నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇప్పిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను అధికారులు సరిచేసి ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. దీంతో డివిజన్లలోని ఓటర్లు ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించగా ఓటరు తుది జాబితా విడుదల అనంతరం రిజర్వేషన్లు ప్రకటించనున్నారు.
రిజర్వేషన్ మారితే ఎలా?
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లున్నాయి. 254 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,82,029 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 90,757 మంది, మహిళలు 91,251 మంది ఉండగా, 21 మంది ఇతరులున్నారు. వీరిలో ఎస్సీ ఓటర్లు 25,419 మంది, ఎస్టీ ఓటర్లు 2,946 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తుది ఓటరు జాబితాను ఈ నెల 10న ప్రకటిస్తే రిజర్వేషన్లు ఏవిధంగా వస్తాయనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. మహిళలకు రిజర్వేషన్ వస్తే తమ కుటుంబ సభ్యుల్లోని వారిని పోటీ చేయించాలనే దానిపై ఆశావహులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్ కలిసి రాకపోతే పక్క డివిజన్ నుంచైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటికే డివిజన్ల వారీగా ఆయా పార్టీల కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ సూచించిన అభ్యర్థులు ఎవరైనా సరే గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచిస్తున్నారు.
బెల్లంపల్లిలో మొదలైన హడావుడి..
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఓటరు జాబితాలో వార్డుల మార్పిడి జరగడం, తప్పుడు వివరాలు నమోదు కావడంతో సవరించాలని కోరుతూ ఓటర్లు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఈనెల 11న లేదా సంక్రాంతి తర్వాత 20లోపు ఎన్నికల నోటిఫికేషన్‌జారీ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ప్రధాన రాజకీయపక్షాలు పోటీకి సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు సమావేశాల నిర్వహణలో తలమునకలయ్యాయి. ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలు స్వీకరిస్తున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గెలుపోటముల గురించి చర్చిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులుండగా.. ఆశావహుల వివరాలు నేతలు తెలుసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం బీజేపీ శ్రేణులు సమావేశం నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని పోటీకి సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం సీపీఐ ముఖ్య నాయకులు ఎన్నికల్లో పోటీ గురించి సమాలోచనలు చేయగా, ఆదివారం బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఏ ర్పాటు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు వార్డుల్లో పోటీ చేయనున్న మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఔత్సాహికుల గురించి గుట్టుగా ఆరా తీసే పని లో నిమగ్నమయ్యారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యే చేయనుండటంతో ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం దిశగా కాంగ్రెస్ రాజకీయాలు మళ్లుతున్నాయి. ఆశావహులు వార్డుల రిజర్వేషన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ చేస్తారో.. తమకు పోటీ చేసే అవకాశం దక్కుతుందో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొందరు పక్క వార్డుల వైపు చూస్తున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల కన్నా ఈసారి జరిగే ఎన్నికల్లో అత్యధికులు పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
మంచిర్యాల నగరపాలక సంస్థ వివరాలు
మొత్తం డివిజన్లు 60
పోలింగ్ కేంద్రాలు 254
మొత్తం ఓటర్లు 1,82,029
ఎస్సీ ఓటర్లు 25,419
ఎస్టీ ఓటర్లు 2,946
చెన్నూర్‌లో గెలుపు గుర్రాల వేట..
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లను గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు సమాయాత్తమవుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టాయి. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు ఆశావహులపై సర్వే చేస్తున్నాయి. మరోవైపు ఆశావహులే టిక్కెట్ల కోసం పార్టీ పెద్దల వద్ద క్యూ కడుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహులు పార్టీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నెల 10న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అనంతరం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించే అవకాశముంది. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో మున్సిపల్ అభ్యర్థుల ఎంపికను మంత్రి వివేక్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. చెన్నూర్ నియోజకవర్గంలో ఉనికి చాటుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌కు పంచాయతీ ఎన్నికల్లో కొంత మైలేజీ రాగా చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇవ్వాలని మిగతా పార్టీలు చూస్తున్నాయి.


