అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మంచిర్యాలటౌన్: అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వడంతో రైల్వేకు ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈఎల్‌ఐ స్కీంను అమలు చేయాలని తాను పార్లమెంట్‌లో అడగ్గా రూ.80వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మంచిర్యాలలోని హమాలీవాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ రూ.10వేలకు పెంచాలని తాను పార్లమెంట్‌లో డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు లేకుండా చేసిన, కూలీల పనిదినాలను 100 నుంచి 60కి కుదించిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. మందమర్రిలో లెదర్ పార్కు, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.4వేల కోట్లతో పెద్దపల్లి–మణుగూరు రైల్వేలైన్ పనులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. చెన్నూరు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుకూలమా కాదా? అనే రిపోర్టు కోసం రూ.55లక్షలను ప్రభుత్వం మంజూరు చేసి సర్వే చేసిందని, త్వరలోనే ఎయిర్‌పోర్టు కల సాకారమవుతుందని తెలిపారు. బెల్లంపల్లిలో జాబ్‌మేళా నిర్వహించి 2వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వివరించారు. బాల్క సుమన్ హైదరాబాద్‌లో కాకుండా చెన్నూరులో ఉండి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని, ఆర్నెళ్లకోసారి వచ్చి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ తదితరులున్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు
మంచిర్యాలఅర్బన్: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో ముచ్చటించారు. అభ్యర్థులు ఎంపీకి సమస్యలు వివరించగా పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బైపాస్‌రోడ్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీసభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, లైబ్రేరియన్ మురళి, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.


