నాటు వైద్యానికి దూరంగా ఉండాలి
బజార్‌హత్నూర్: ఆదివాసీ గిరిజనులు అనారోగ్యానికి గురైతే నాటు వైద్యం నమ్మకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం మండలంలోని డేడ్రా గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత లక్ష్యాలను ఏర్పర్చుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. డేడ్రా, మాన్కపూర్, గిరిజాయి, కొలాంగూడ, ఉమార్డ, భూతాయి(కే), బద్దునాయక్‌తాండ గ్రామాల గిరిజనులకు బ్లాంకెట్లు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ రాహుల్‌కాంత్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సైలు సంజయ్‌కుమార్, శ్రీసాయి, సర్పంచ్ విజయలక్ష్మి, లింగుపటేల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ అధ్యక్షుడు డాక్టర్ వెంకట్‌రెడ్డి, వైద్యులు అభిజిత్, శిల్పా, సందీప్, హేమలత, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెంచాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


