అడవిజంతువు దాడిలో ఏడు గొర్రెలు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగాపూర్‌లో అల్లంల రమేశ్‌కు చెందిన ఏడు గొర్రెలపై శనివారం వేకువజామున అడవిజంతువు దాడి చేయడంతో మృతి చెందాయి. మండల పశువైద్యాధికారి డాక్టర్ శాంతిరేఖ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. షెడ్డులో ఉంచిన గొర్రెలపై గుర్తు తెలియని అటవీ జంతువు దాడిచేసి ఉంటుందని, ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. గొర్రెల విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. 20 రోజుల క్రితం అదే గ్రామంలో గుండాల రమేశ్, కొమ్ము పోచయ్యకు చెందిన 20 గొర్రెలు అడవి జంతువుల దాడిలో మృతి చెందాయని స్థానికులు పేర్కొన్నారు. రాత్రివేళ నక్కల అరుపులు వినిపిస్తున్నాయన్నారు.


