మహాపూజకు సిద్ధమవుతున్న మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18న నిర్వహించనున్న నాగోబా మహాపూజతో పాటు సంప్రదాయ పూజల నిర్వహణకు మెస్రం వంశీయులు సిద్ధమవుతున్నారు. శనివారం మెస్రం వంశ మహిళలు నాగోబా మహాపూజతో పాటు సంప్రదాయ ముగింపు వరకు ప్రత్యేక పూజలకు అవసరమయ్యే స్వచ్ఛమైన నువ్వులతో గానుగ ద్వారా నూనె తీశారు. ఈ నూనెను నాగోబా మహాపూజతో పాటు నైవేద్యానికి వాడుతామని మెస్రం వంశ మహిళలు తెలిపారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్‌కు అందిన సమాచారం మేరకు సెక్షన్ అధికారులు రవి, హన్మంతరావు, బీట్ అధికారులు రాజేశ్వర్, శ్రీనివాస్, తన్వీర్ పాషా ఇందన్‌పల్లి పరిధిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అనుమతి లేకుండా ఇసుక తీయడం నేరమని, ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని రేంజ్ అధికారి హెచ్చరించారు.


