వికేంద్రీకృత వ్యవస్థతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారంలో వికేంద్రీకృత వ్యవస్థల అమలు అత్యంత కీలకమని కలెక్టర్ రాజార్షి షా అన్నారు. కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో వికేంద్రీకృత ప్రజావాణి విధానంపై శనివారం నిర్వహించిన సెమినార్‌కు హాజరయ్యారు. వికేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు అనే అంశంపై ప్రసంగించారు. ప్రజావాణి వ్యవస్థను స్థానిక స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, న్యాయసమ్మత పరిష్కారాలు అందించవచ్చన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘వికేంద్రీకృత ప్రజావాణి’ విధానాన్ని వివరించారు. అనంతరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ న్యాయ, ప్రజా విధాన విభాగాల విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా సంభాషించారు. అడ్మినిస్ట్రేటర్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు, తెలంగాణలో వికేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ భవిష్యత్ దిశ పై అవగాహన కల్పించారు. సివిల్ సర్వెంట్లుగా మారాలని ఆకాంక్షించే విద్యార్థులకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ ప్రసంగం ప్రజా పాలనపై లోతైన అవగాహనను కల్పించిందని ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ వర్గాలు ప్రశంసించాయి.


