నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రోడ్డు భద్రతలో భాగస్వామ్యం అవుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకుంటారని జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ) రంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని వేంపల్లిలో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని, అవసరమైతే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ, కిషోర్‌చంద్రారెడ్డి, ఏఎంవీఐలు ఖాసిం, సూర్యతేజ, సాయిలెనిన్, రవాణా శాఖ సిబ్బంది, వాహనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన
ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు ఏఎంవీఐ సూర్యతేజ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ మహేశ్వర్‌రావు, జూనియర్ లెక్చరర్ ముత్యం, పీజీటీ రాజేశ్వర్, పీఈటీ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
జైపూర్: వాహనదారులు నిబంధనలు పాటించాలని ఎంవీఐలు రజింత్, కిశోర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఈ–స్పెషల్ డ్రైవ్ చేపట్టి 300కుపైగా వాహనదారులకు పలు అంశాలు వివరించారు. సీటుబెల్ట్ ధరించని, నంబరు ప్లేట్ లేని వాహనాలు, విండోగ్లాస్ బ్లాక్‌ఫిల్మ్ ఉన్న 32వాహనదారులకు జరిమానా విధించారు. అనంతరం స్థానిక హైస్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అధికారులు ఎస్‌కే.ఖాసిం, సూర్య, సాయి పాల్గొన్నారు.


