ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
● జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
నెన్నెల: ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు సూచించారు. శుక్రవారం జోగాపూర్ రైతువేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే నేల ఆరోగ్యాన్ని పెంచవచ్చని అన్నారు. జీవామృతం వంటి సహజ ఎరువులు వాడడంతో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులతో మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన మెలకువలు, సాగు పద్ధతులపై వివరించారు. యాసంగిలో సకాలంలో సాగు చేయడం ద్వారా కోతల సమయంలో వచ్చే వర్షాలతో నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. 50శాతం సబ్సిడీపై వేప నూనె మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో అందుబాటులో ఉందని తెలిపారు. ఆయిల్‌ఫామ్ సాగుకు ఈ ప్రాంతంలో భూములు అనుకూలంగా ఉన్నాయని, రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సృజన, ఏఈఓ శైని, రైతులు పాల్గొన్నారు.


