ఉత్తర్వులు సరే.. నిధులేవి?
జంగుబాయి ఆలయంపై పట్టింపేది? వివిధ పనులకు నిధులు మంజూరు ప్రొసీడింగ్ ఇచ్చిన మంత్రి సీతక్క ఏడాదైనా విడుదల కాని నిధులు
కెరమెరి: జంగుబాయి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు ఇప్పటికీ మంజూరు కాలేదు. గతేడాది జనవరిలో మండలంలోని మహరాజ్‌గూడలోగల జంగుబాయి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన మహాపూజకు హాజరైన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క రూ.50లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసి ప్రొసీడింగ్ కూడా అందించారు. పనులు తుదిదశకు చేరుతున్నా నిధులు మాత్రం విడుదల కాలేదు. నిర్వాహకులతోపాటు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ప్రారంభంకాని మరుగుదొడ్ల నిర్మాణం
రూ.15 లక్షలతో చేపట్టాల్సిన మరుగుదొడ్ల పనులు నేటికీ మొదలుకాలేదు. గతేడాది నుంచి ప్రభుత్వ నిధులు మంజూరు కాలేదు. చేసిన పనులకు బిల్లులు వస్తే.. ఇతర పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. పనుల కొలతలు తీసుకుని ఎంబీ రికార్డు చేయలేదు. ఇప్పటికై నా జిల్లాస్థాయి అధికారులు స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
ఎంబీ రికార్డు చేయలేదు
రూ.10 లక్షల నిధులతో షెడ్ల నిర్మాణం పూర్తయి ఏడాదైంది. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు ఎంబీ రికార్డు చేయలేదు. పలుసార్లు వారిని కలిసి బిల్లుల గురించి చెప్పినా సరైన సమాధానం రావడంలేదు. టొప్లకస వరకు కూడా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. భక్తుల ప్రయాణానికి ఉపయోగపడుతున్న ఈ రోడ్డుకు కూడా నిధులు అందలేదు. బిల్లులు త్వరగా అందించాలి. – సలాం శ్యాంరావు,
జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్
చేపట్టిన పనులివే..
జంగుబాయి పుణ్యక్షేత్రానికి రూ.50లక్షలు కేటా యించగా, రూ.25 లక్షలతో తాగునీటి ట్యాంక్, పైపులైన్, రూ.10 లక్షలతో రెండు షెడ్లు, రూ.15 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే రూ.10లక్షలు వెచ్చించి ఆలయ కమిటీ సభ్యులు షెడ్లు నిర్మించారు. ప్రస్తుత ఉత్సవాలకు అవి వినియోగంలోకి రానున్నాయి. ఇక తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులు 60శాతం పూర్తికాగా, పైపులైన్ పనులు ప్రారంభించలేదు. మరో రెండు నెలల్లో పనులు పూర్తికావొచ్చని కమిటీ సభ్యులు చెబుతున్నారు. సుమారు రూ.30లక్షల విలువైన పనులు పూర్తయినా అధికారులు నిధులు విడుదలలో జాప్యం చేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒకే చేతిపంపు ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహరాజ్‌గూడ నుంచి ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో నిర్మించిన వంతెన నుంచి టొప్లకస వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయినా రూ.5లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు ఇంకా అందలేదు.
ఉత్తర్వులు సరే.. నిధులేవి?
ఉత్తర్వులు సరే.. నిధులేవి?


