ఈసారీ ఎన్నికలు లేనట్టే!
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ ఏ ర్పడి మూడు దశాబ్దాలవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు. 1/70 (గిరిజన చట్టం) ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న మందమర్రి 1995లో మున్సిపాలిటీగా ఏర్పడింది. 1998లో ఎన్నికల నిర్వహణకు చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మరో ఐదురోజుల్లో ఎన్నికలుండగా అప్పటి మాజీ సర్పంచ్ మద్ది రాంచందర్ మందమర్రి ఏజెన్సీ (1/70) ప్రాంతం కాబట్టి చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించాలని కోరుతూ కోర్టుకు వెళ్లాడు. దీంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించడంతో ఎన్నికలు ఆగిపోయాయి. కోర్టులో కేసు వీగిపోయినా అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉంటోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారి నా మున్సిపాలిటీ ఎన్నికల పరిస్థితి మాత్రం మా రడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్థాయి ప్రతినిధులు వచ్చి హామీలు గుప్పించి వెళ్తారు కానీ.. గెలిచాక మున్సిపాలిటీ ఎన్నికల విషయాన్ని మాత్రం పట్టించుకున్న వారే లేరని మందమర్రి మున్సిపాలిటీ ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు.
త్రిసభ్య కమిటీతోనే అభివృద్ధి
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో 24 (సింగరేణి ఏరియాలోని తొమ్మిది వార్డులతో కలిపి) వార్డులున్నాయి. సుమారు 60వేల వరకు జనాభా ఉంది. అభివృద్ధి మాత్రం చెన్నూర్ శాసన సభ్యుడు, మంచిర్యాల జెడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్ ఉన్న త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో పలు వార్డుల్లో సరైన అభివృద్ధి జరగక వెనుకబడి పోతున్నామని ఊరు మందమర్రి, ఎర్రగుంటపల్లె, నార్లాపూర్, ఊరు రామకృష్ణాపూర్ ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. త్రిసభ్య కమిటీ కూడా అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఉన్న నాయకులకు (కాంట్రాక్టర్లు) మాత్రమే ప్రాధాన్యమిస్తూ మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తోందని ఆరోపించారు. (కాంట్రాక్టర్లు) చేసిన అభివృద్ధి పనుల్లోనూ ఎలాంటి నాణ్యత కనిపించడం లేదని, త్రిసభ్య కమిటీ జరిగే అభివృద్ధి పనులపై ఆరా తీసింది లేదని, పట్టించుకోదని స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ప్రాంతంలోగల తొమ్మిది వార్డుల్లో మాత్రం అభివృద్ధి సింగరేణి యాజమాన్యమే చూసుకుంటోంది.
ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తేనే ఎన్నికలు
మందమర్రి మున్సిపాలిటీలో గిరిజనులకు సరైన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నిర్వహించాలి. దీనిపై న్యాయవాదితో కౌంటర్ ఫైల్ వేయడం జరిగింది. కానీ, ఆ కేసు ముందుకురావడం లేదు. మందమర్రి మున్సిపల్ ఎన్నిక కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
– వివేక్ వెంకటస్వామి, మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే
మంత్రి, ఎంపీ చొరవ తీసుకోవాలి
రాష్త్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ సారి కూడా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర గనులు, కార్మిక ఉపాధిశాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా ఉన్న గడ్డం వంశీకృష్ణ చొరవ తీసుకుని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.
ఈసారీ ఎన్నికలు లేనట్టే!


