నారుమడి.. జాగ్రత్తలు తప్పనిసరి
చెన్నూర్‌రూరల్: యాసంగి సాగులో భాగంగా రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకోగా, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. కలుపు, ఊద సమస్యలు రాకుండా ఎకరా నారుమడిలో 1.5 లీటర్ల బుటీక్లోర్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వేసే సమయంలో లేదా ఎనిమిదో రోజున పిచికారీ చేయాలని తెలిపారు. లేదా విత్తిన 14–15రోజుల్లో సైహలోపాప్ బ్యుటైల్ 10శాతం 400మి.లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వరి నాట్లు వేసిన 4–5 రోజులకు ఎకరాకు 30–40గ్రాముల ఆక్సిడయార్జిల్ 25కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలని తెలిపారు. నాటిన 25–30 రోజుల్లో పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాముల 2.4–డీ సోడియం సాల్ట్ 80శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేలా పిచికారీ చేయాలని సూచించారు. నారు మడిలో పిచ్చుకలు వాలి గింజలు తినకుండా, అడవి పందులు నారును నాశనం చేయకుండా ఉండేందుకు నాలుగు వైపులా నాలుగు పొడవాటి కర్రలు ఏర్పాటు చేసి వాటికి కవర్లు తొడగాలని తెలిపారు. గాలి వీచినప్పుడు ఆ కవర్లు చప్పుడై అవి నారుమడి దగ్గరకు రావని పేర్కొన్నారు. నారు మడి చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలకు ఖాళీ సీసాలతో పాటు నట్, బోల్ట్ ఏర్పాటు చేయాలని లేదా పాత పల్లానికి రంధ్రం చేసి దానికి బోల్ట్ కడితే గాలికి అవి కదిలి వచ్చే శబ్ధానికి పిచ్చుకలు, అడవిపందులు అటువైపు రావని తెలిపారు.


