సర్పంచ్‌లు ఎమ్మెల్యే అయ్యారు..
ఆదిలాబాద్‌టౌన్: సర్పంచ్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా అడుగు వేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేలూ అయ్యారు. ఇద్దరిదీ ఒకే మండలం.. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. వీరిలో ఒకరు ఆదిలాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాగా, మరొకరు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న.
సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను..
యూత్ ప్రెసిడెంట్‌గా అనేక సేవ కార్యక్రమాలు చేయడంతో 1988లో నన్ను జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా ఊరిలో తాగునీటి సమస్య అధికంగా ఉండేది. దీంతో 1981 నుంచి 1983 వరకు యూత్ సభ్యులం కలిసి గ్రామంలో 300 హ్యాండ్ బోర్లు వేయించాం. అనేక సేవ కార్యక్రమాలు చేసేవాళ్లం. దాంతో నాపై గ్రామస్తులు నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో సర్పంచ్ అంటే నమ్మకం. గ్రామాభివృద్ధి, అవినీతికి దూరంగా ఉండేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి జరిగేదని ఆకాంక్షించేవారు. గ్రామంలో సీసీ రోడ్లు, రాజీవ్ రోజ్‌గార్ యోజన పథకం కింద సంవత్సరానికి రూ.లక్ష వచ్చేవి. ఆ నిధులను 25 శాతం మొక్కలు నాటించేందుకు, 75 శాతం గ్రామంలో వివిధ పనులు చేయించేందుకు ఖర్చు చేశాను. స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో నేను ప్రజాసేవ చేయాలని రాజకీయంలోకి వచ్చాను. సర్పంచ్‌గా ఉన్న నేను 1989లో వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యాను. అంచెలంచెలుగా పదవులు చేపట్టాను. – జోగు రామన్న, మాజీ మంత్రి


