కేజీబీవీలకు మహర్దశ
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు మహర్దశ రానుంది. బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నిధులు కే టాయించింది. దీంతో విద్యాలయాల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్య, వసతులు అందించడమే లక్ష్యంగా కేజీబీవీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపర్చి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. మొదట్లో కేజీబీవీల్లో పదో తరగతి వరకు మాత్రమే తరగతులు కొనసాగేవి. జిల్లాలో మూడు కేజీబీవీలు మినహా కాలక్రమేణ ఇంటర్మీడియెట్‌కు అప్‌గ్రేడ్ చేశారు. అప్‌గ్రేడ్ కేజీబీవీలతోపాటు మిగతా కేజీబీవీల్లో వసతుల కల్పనకు నాబార్డు నిధులు కేటాయించింది. జిల్లా విద్యాశాఖ అధికారి, స్పెషల్ ఆఫీసర్లు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సమన్వయంతో మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు, మరమ్మతులు గుర్తించనున్నారు. విద్యాలయాల్లో వచ్చే విద్యాసంవత్సరం పునఃప్రారంభంలోపే పునరుద్ధరణ, మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఉత్తర్వులు రావడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
మౌలిక వసతులు ఇలా..
జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. మూడింటిలో పదో తరగతి, 15 చోట్ల ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇదివరకు 4,589 మంది బాలికలు అభ్యసిస్తున్నారు. ఇటీవల ఐదు కేజీబీవీ ల్లో ఇంటర్ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. రెండు చోట్ల రెండు, మూడు చోట్ల ఒకే కోర్సులో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. గదుల కొరత, సౌకర్యాల లేమి నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టనున్నారు. ఆయా కేజీబీవీల్లో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జలట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటిపంపులు, బోర్‌వెల్‌లు, ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్, డార్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్‌ల ఏర్పాటు, భవన మరమ్మతులు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు చేపట్టనున్నారు. సాధ్యమైన చోట ప్రస్తుత భవనాల మొదటి, రెండో అంతస్తుతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిపాలన అనుమతితో కేటాయించిన మొత్తానికి మించి అదనపు ఆర్థిక కేటాయింపు చేయకూడదనే నిబంధనలు విధించారు. అంచనాలు తయారు, పనులు అమలులో నాబార్డు మార్గదర్శకాలు, పీడబ్ల్యూడీ, సీపీడబ్ల్యూడీ నిబంధనల ద్వారా సూచించిన సాంకేతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పొక్యుర్‌మెంటు ప్లాట్‌ఫామ్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలవాలని ఆదేశాలు వచ్చాయి. 2026–27 విద్యాసంవత్సరం పునః ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ క్రమం తప్పకుండా పనుల పురోగతి నివేదికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. ఒక్కో కేజీబీవీలో మౌలిక వసతులకు అవసరం మేరకు ఒక్కో తీరుగా నాబార్డు నిధులు కేటాయించారు.
మండలాల వారీగా నిధుల వివరాలు
విద్యాలయం నిధులు(రూ.లక్షల్లో)
బెల్లంపల్లి 38.172
చెన్నూర్ 57.400
జన్నారం 38.172
లక్సెట్టిపేట 38.172
మంచిర్యాల 38.172
మందమర్రి 57.500
నెన్నెల 38.172
తాండూర్ 80.152
జైపూర్ 49.950
నస్పూర్ 88.552
భీమిని 42.123
భీమారం 42.123
దండేపలి 42.123
హాజీపూర్ 54.500
కన్నెపల్లి 54.500
కాసిపేట 42.123
కోటపల్లి 42.129
వేమనపల్లి 42.123


