సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ కోసం చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’(ఆర్‌బీఎస్‌ఎస్) పనుల్లో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో సహా మొత్తం 40స్టేషన్ల ఆధునీకరణ కోసం నిధుల ఖర్చు అంచనా రూ.2,750 కోట్లు ఉంది. స్టేషన్ స్థాయిని బట్టి నిధులు వెచ్చిస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న మంచిర్యాల రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.26కోట్లు మంజూరయ్యాయి. 2023 కంటే ముందే ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో నిత్యం ప్రయాణికులు రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పొరుగున ఉన్న రామగుండం రైల్వేస్టేషన్‌లో పనులు దాదాపు పూర్తయ్యాయి. మంచిర్యాల స్టేషన్‌లో మాత్రం జాప్యం జరుగుతోంది.
త్వరగా పూర్తయితేనే..
ప్రధాన నగరాల్లోని స్టేషన్లతోపాటు రెండో తరగతి పట్టణాల్లో ఉన్న స్టేషన్లు ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో అమృత్ స్కీం కింద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక మరుగుదొడ్లు, స్టేషన్ పరిధిని మరింత పెంచడం, పార్కింగ్ ఏరియాను పెంచి షెడ్లు, ప్రవేశ ద్వారా నిర్మాణం, కాలినడక వంతెన(ఎఫ్‌వోబీ), ప్లాట్‌ఫాంపై నీడనిచ్చే షెడ్లు(పీవోపీ), ప్లాట్‌ఫాం నిడివి పెంచి కొత్తగా నిర్మించడం, లైటింగ్, పచ్చదనం పెంపు, రైళ్ల సమాచారం తెలిపే ఆధునాతన బోర్డులు తదితర పనులు చేయాలి. పనులు పొందిన కాంట్రాక్టర్లు మొదట వేగంగా మొదలై తర్వాత జాప్యం చేశారు. కొంతకాలం బిల్లుల చెల్లింపులు లేవని పనులు నిలిచిపోయాయి. త్వరలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో చివరి దశలో ఉన్న స్టేషన్ల పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు రైల్వే ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకా పనులు ఆశించిన స్థాయిలో పురోగతిలో లేవు. 2023 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించి మూడేళ్లు గడిచిపోయాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


