రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం ముల్కల్లలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రహదారి భధ్రతా నియమాలు పాటిస్తే అంతా సురక్షితంగా ఇంటికి చేరుకుంటారని తెలిపారు. ముల్కల్ల గ్రామ పరిధి లో గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను వివరిస్తూ ప్రతియేటా ఐదుగురు చనిపోతున్నారని, ఈ ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ఎంవీఐ రంజిత్, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఎంపీడీఓ సాయివెంకట్‌రెడ్డి, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్ కళాబృందం ప్రదర్శన స్థానికులను ఆలోచింపజేసింది. రహదారి భద్రత కమిటీని ఏర్పాటు చేసి విధులపై వివరిస్తూ నిబద్ధతగా వ్యవహరించాలని డీసీపీ సూచించారు. రహదారి భద్రతపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు..
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 5న జరిగే కార్తిక పౌర్ణమి జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని డీసీపీ భాస్కర్ సూచించారు. ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సోమవారం గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు. సత్యదేవుణ్ని దర్శించుకున్న అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులు, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సైలు సురేష్, తహాసీనొద్దీన్‌తో చర్చించి సూచనలు చేశారు.


