
కేసుల దర్యాప్తులో అలసత్వం వహించొద్దు
కోటపల్లి: కేసుల దర్యాప్తులో అధికారులు అలసత్వం వహించొద్దని, ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. గురువారం ఆయన కోటపల్లి పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందిస్తూ సంఘటన స్థలానికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఆధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో సీఐ బన్సిలాల్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు.
గొప్ప లక్ష్యాలు ఎంచుకోవాలి
చెన్నూర్‌రూరల్: విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలని డీసీపీ భాస్కర్ అన్నారు. మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కేరియర్ గైడ్‌లెన్స్ అనే అంశంపై గురువారం జీకే పరీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీపీ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్‌రావు, ఎంపీడీవో మోహన్, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవి.పట్వర్దన్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, డీసీపీ భాస్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ అలీ ఉన్నారు.