
పోలీసుల పహారాలో యూరియా పంపిణీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/చెన్నూర్‌రూరల్: హాజీపూర్ మండలం పడ్తనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాల పంపిణీ కొనసాగింది. మంగళవారం యూరియా కోసం రోడ్డెక్కిన రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున బుధవారం అందజేశారు. ఉదయం 5 గంటలకే వచ్చిన రైతులు యూరియా కోసం చాలా సమయం నిరీక్షించారు. రైతుల తోపులాటలు జరగకుండా హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వరస క్రమంలో 222 మంది రైతులకు 444 యూరియా బస్తాలు పంపిణీ చేశారు. 110 రైతులకు మరుసటి రోజు కోసం ముందస్తుగా టోకెన్లు అందజేశారు. చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలోని పీఏసీఎస్‌కు 222 యూరియా బస్తాలు వచ్చాయి. వ్యవసాయశాఖ అధికారులు రైతు వేదిక వద్ద ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా పంపిణీ చేశారు.