
‘చలో భద్రాచలం’ విజయవంతం చేయండి
ఆదిలాబాద్‌రూరల్: ఈనెల 28న నిర్వహించే చలో భద్రాచలం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసీలు విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాల రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సోయం బాపూరావు, జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని చలో భద్రాచలం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత ఢిల్లీలో సభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో 9 తెగల సంఘాల నాయకులు, అడ్వొకేట్ సంఘం, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.