
పోకిరీలపై ఫోకస్!
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లాలో కొన్ని నెలలుగా పోకిరీలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారు. కొందరు బైక్‌లపై వేగంగా తిరుగుతూ వా హనదారులకు, పట్టణవాసులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లతో చిల్లర చేస్తున్నారు. కొన్ని గ్యాంగులు దాడులకు సైతం తెగబడుతున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోకిరీలపై ఫోకస్ పెట్టారు. గ్యాంగ్ దాడులకు దిగుతున్న రౌడీలపై ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో నాలుగు నెలల్లో జిల్లాలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ..
కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు స్వీకరించిన రోజే జిల్లా కేంద్రంలోని శివాజీ గ్రౌండ్‌లో ఏర్రగుంటపల్లి సంపత్ అనే రౌడీ షీటర్‌పై ప్రత్యర్థి గ్యాంగ్ దాడి జరిగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన సీపీ రెండో రోజు నుంచే గ్యాంగ్ దాడుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో అలజడులకు కారణమయ్యే వ్యక్తులు, వారికి అండగా నిలిచే వారిని గుర్తించి ప్రత్యేక జాబితా తయారు చేశారు. దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు. 30 మంది పోలీసులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లో విస్తృత తనిఖీలు, పెట్రోలింగ్‌ను బలోపేతం చేశారు.
అర్ధరాత్రి తనిఖీలతో హడల్..
కొన్ని నెలలుగా రామగుండం పోలీసులు అర్ధరాత్రి వేళ విస్తృత తనిఖీలు, పెట్రోలింగ్‌తో పాటు ట్రాకింగ్ డాగ్స్‌తో రౌడీ షీటర్లు, గంజాయి కేసుల్లో నిందితుల ఇళ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ జరిమానా విధిస్తున్నారు. గతంలో సీపీ సత్యనారాయణ హయాంలో ‘ఆపరేషన్ ఛభుత్ర’ పేరుతో నిర్వహించిన అర్ధరాత్రి తనిఖీలు ఆయన బదిలీ తర్వాత ఆగిపోయినప్పటికీ ప్రస్తుత సీపీ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో కొత్త ప్రణాళికతో ఈ చర్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
వారికి ఫ్రెండ్లీ.. వీరికి యాంగ్రీ..
సీపీ అంబర్ కిశోర్ ఝా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను బాధితుల కోసం మాత్రమే అమలు చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి యాంగ్రీగా వ్యవహరిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌లు, మద్యం సేవించి రోడ్లపై తిరిగే వారు, అర్ధరాత్రి సరైన కారణం లేకుండా రోడ్లపై కనిపించే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సీపీ సమాజంలో ఆశాంతి కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.
అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు
రాత్రి గుంపులుగా తిరిగే వారిపై కొరడా
దాడులకు ఉసిగొల్పుతున్న వారికి సీపీ వార్నింగ్
బాధితులకు మాత్రమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’