
ప్రాదేశికం.. తర్వాతే పంచాయతీ
● ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం
● జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలు ఫైనల్
● ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం
● అధికారులకు ఎన్నికల సంఘం సంకేతాలు
● సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు, ఆశావహులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయా? అంటే అవున నే తెలుస్తోంది. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను అధికారికంగా ప్రకటించడం.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ వేగవంతంగా అమలు చేస్తుండడంతో పాటు అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంలాంటివి చూ స్తుంటే మరో పక్షం రోజుల్లో ఎన్నికలకు నోటిఫికేష న్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల స్థానాలపై స్పష్టతరాగా ప్రస్తుతం జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించింది.
పంచాయతీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి..
జిల్లాలోని 16 మండలాల్లో 306 గ్రామ పంచాయతీలు, 2,730 వార్డులు, 3,84,746 మంది ఓటర్లు ఉన్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించిన అధికారులు ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు సైతం సిద్ధం చేశారు. ఇక ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి ఉంచారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిపిస్తామని ప్రకటించి గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ కూడా పంపించారు. ఈ రిజర్వేషన్‌ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ నెల చివరిలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని తెలుస్తోంది.
ఊపందుకున్న ‘స్థానిక’ సందడి..
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఆశావహుల్లో సందడి మొదలైంది. ఇందిరమ్మ ఇంటి పథకం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, రైతుభరోసా తదితర పథకాల అమలును కాంగ్రెస్ పార్టీ వేడుకలా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి లబ్ధిపొందాలని భావిస్తూ పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి. చాలా వరకు ఆశావహులు ప్రధాన పార్టీల గుర్తులపై పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నేతల ఇళ్లకు వెళ్తూ టికెట్‌కోసం ప్రయత్నాలు సాగిస్తుండటంతో ఎక్కడ చూసినా బిజీ వాతావరణం కనిపిస్తోంది.
జిల్లాలో ప్రాదేశిక, పంచాయతీల వివరాలు
జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్‌లు వార్డులు
1 16 16 129 306 2,730