
ఆవుల మందపై పులి దాడి
● లేగదూడ మృతి ● హడలిపోయిన పశువుల కాపరులు
కాసిపేట: మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడిచేసిన ఘటన మండలంలోని ధర్మారావుపేట అటవీ సెక్షన్ పరిధిలో ఆదివారం జరిగింది. బెల్లంపల్లి రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ బీట్‌లోని రొట్టెపల్లి అటవీ ప్రాంతంలోకి గోండుగూడకు చెందిన పశువుల కాపరులు తిరుపతి, లక్ష్మణ్ పశువులను ఉదయం మేతకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆవులు మేస్తుండగా పొదల్లో నక్కిన పెద్దపులి అక్కడకు వచ్చింది. ఆవులు దానిని చూసి బెదరడంతో కాపరులు అప్రమత్తమయ్యారు. కేకలు వేశారు. ఈ క్రమంలో పులి లేగదూడపై పంజా విసిరింది. దానిని ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపరులు వెంటనే చెట్లపైకి ఎక్కి గ్రామస్తులు, పశువుల యజమానులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి రేంజ్ అధికారి పూర్ణచందర్, డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్, సిబ్బంది, గ్రామస్తులతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. పులి దాడిలో కుర్సింగ అచ్యుతరావుకు చెందిన లేగదూడ చనిపోయినట్లు గుర్తించారు. పశువుల కాపరులతో మాట్లాడారు. పులి తమ కేకలు విని పారిపోయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా పులి పాదముద్రలను గుర్తించారు. పులి దాడిచేసినట్లు నిర్ధారించారు. దూడ యజమానికి పరిహారం అందిస్తామన్నారు. పశువుల కాపరులు, అడవి సమీపంలోని చేలల్లోకి వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి సంచారంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తామని తెలిపారు. అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.