
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లిరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల శివారులోని ఆర్‌పీ గార్డెన్స్‌లో బెల్లంపల్లి నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నృత్యాలతో స్వాగతం పలికారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన తినుబండరాల స్టాళ్లను పరిశీలించారు. మహిళలు అన్నిరంగాల్లో ఉన్నతంగా రాణించాలని ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో రూ.25 కోట్ల రుణాలు, రూ.6.7కోట్ల వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందజేసినట్లు తెలిపారు. రుణబీమా పథకంలో భాగంగా 13 మంది మహిళలకు రూ.30.17 లక్షలు , ప్రమాదబీమా పథకంలో నలుగురు మహిళలకు రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అనంతరం గీత కార్మికులకు కాటమయ్య కిట్, మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, డీపీఎం స్వర్ణలత, తహసీల్దార్ కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కారుకూరి రాంచందర్, మత్తమారి సూరిబాబు, దావ రమేశ్‌బాబు, సత్తయ్య, బత్తుల రవి, స్వామి, మల్లయ్య, శారద, రవీందర్‌రెడ్డి, శంకర్, మురళీధర్‌రావు, నర్సింగరావు, ప్రదీప్, హరీశ్, సంతోష్, ఐకేపీ ఏపీఎంలు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.