
నగర పాలన అస్తవ్యస్తం
● సెలవులో వెళ్లిన రెగ్యులర్ కమిషనర్ ● లక్సెట్టిపేట కమిషనర్‌కు అదనపు బాధ్యతలు ● చెక్‌పవర్, అధికారాలు లేవు! ● కొరవడిన పారిశుద్ధ్యం.. రెండు డెంగీ కేసులు నమోదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పాలన అస్తవ్యస్తంగా మారింది. రెగ్యులర్ కమిషనర్ శివాజి ఈ నెల ఒకటి నుంచి 15వరకు సెలవుపై వెళ్లారు. దీంతో ఈ నెల 2న కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్‌కు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే లక్సెట్టిపేట కమిషనర్ సంపత్‌కుమార్‌కు ఈ నెల 15వరకు ఇంచార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 15వరకు ఇంచార్జి కమిషనర్ గడువు ముగిసింది. రెగ్యులర్ కమిషనర్ రాకపోవడంతో ఇప్పటికీ లక్సెట్టిపేట కమిషనర్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. చెక్‌పవర్‌తోపాటు ఇతరత్రా అధికారాలు లేకపోవడంతో అభివృద్ధితోపాటు పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టడం లేదు. నస్పూరు, మంచిర్యాల మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి మంచిర్యాల కార్పొరేషన్‌గా మార్చడంతో పరిధి విస్తృతంగా పెరిగింది. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో ప్రజలకు మౌలిక వసతులు కరువయ్యాయి. సెలవులో వెళ్లిన కమిషనర్ శివాజి తిరిగి విధుల్లో చేరడమో, కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టడమో చేసే వరకు పాలన గాడినపడడం కష్టమే.
వర్షాకాలం... రోగాల మయం
ప్రతియేటా వర్షాకాలానికి ముందే పారిశుద్ధ్య పనులు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో చేపట్టాల్సి ఉంది. కానీ కార్పొరేషన్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వర్షాలు కురుస్తుండడం, డ్రెయినేజీల్లో పూడిక పెరిగి మురుగునీరు రోడ్లపై పారుతుండడం, రోడ్లు డ్రెయినేజీ నీటితో నిండి ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. నగరంలోని హైటెక్‌సిటీ కాలనీలోని రోడ్లపై డ్రెయినేజీ నీరు నిండి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి డ్రెయినేజీ నీరు రోడ్లపై పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. హైటెక్‌సిటీలో డెంగీ కేసు నమోదు కాగా, వందలాది మంది జ్వరాల బారిన పడ్డారు. నస్పూరులోనూ అదే పరిస్థితి. ఒక డెంగీ కేసు నమోదు కాగా, ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. పారిశుద్ధ్యాన్ని పట్టించుకోకపోవడం, చెత్తాచెదారం, డ్రెయినేజీ నీరు రోడ్లపై పారుతుండడంతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.
వంద రోజుల కార్యాచరణ అమలేది?
ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2నుంచి సెప్టెంబర్ 10వరకు వంద రోజులపాటు సమస్యలు లేని పట్టణాలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వంద రోజుల కార్యాచరణలో వార్డుల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, డ్రెయినేజీలు, వర్షపు నీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. ఇప్పటికే 50రోజులు పూర్తి కాగా, మరో 50 రోజుల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం అడ్డంకిగా మారుతోంది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం చేయడంపై అధికారులు దృష్టి సారించకపోవడంతోనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారినా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, నగర శివారు ప్రాంతాల్లో మురుగు నీరు, చెత్తాచెదారం పేరుకు పోవడం గమనార్హం.