
శ్రావణం..శుభకరం..!
● నేటి నుంచి శ్రావణ మాసం ఆరంభం ● మహిళలకు ప్రీతిపాత్రం ● ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి
శుభాలమాసం..
హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వేదపారాయణాలు, వ్రతాలు, పూజలు, శివారాధనకు అత్యంత అనుకూలమైన మాసం. ఈమాసంలో భగవంతుడిని భక్తితో ఆరాదిస్తే సకల శుభాలు కలుగుతాయి. నోములు, వ్రతాలకు అనుమైన మాసం. సిరి సంపదలు ప్రసాదించాలని మహాలక్ష్మీ అమ్మవారిని కొలిచే శ్రావణమాసంలో శివశక్తిని సైతం పూజిస్తారు. తపస్సు, ధ్యానం, జపం, యోగాభ్యాసం చేయటానికి అనుకూలం. ప్రకృతి ఉత్కృష్టంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనకు శుభంగా పరిగణించబడుతుంది. – శ్రీరాంభట్ల శంశాక్‌శర్మ,
అర్చకుడు, మంచిర్యాల
అన్నీ మంచిరోజులే..
శ్రావణ మాసంలో అన్నీ మంచిరోజులే. ఈ మాసాన్ని పండుగల మాసమని, వ్రతాల మాసమని చెప్పవచ్చు. శివునికి ప్రీతి పాత్రమైన మాసం కావడంతో ఏకబిల్వం శివార్పణం అంటూ పూజలు చేస్తే ఆ శివుని అనుగ్రహం లభిస్తుంది. యువతులు, మహిళలు, వరలక్ష్మీ, మంగళగౌరీ వ్రతాలు, నోములు జరుపుకుంటారు. ఈ మాసంలో శుభకార్యాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
– వేమారం మహేశ్వరశర్మ,
పురోహితుడు, చెన్నూర్
మంచిర్యాలఅర్బన్/నిర్మల్‌చైన్‌గేట్/చెన్నూర్: శ్రావణం..శుభకరం.. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువారంతో ఆషాఢమాసం ముగిసిపోయి సకల శుభకార్యాలకు శుభప్రదంగా భావించే శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మహిళలు భక్తితో అమ్మవారిని ఆరాధించే పూజల మాసం. ఈమాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాలు ఎంతో ప్రత్యేకమైనవి. వివాహాలు, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, శుభకార్యాలు శ్రావణంలో జరుపుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఈనెలలోనే పౌర్ణమిరోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి సంచరించటం వల్ల శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని వేదపండితులు చెబుతున్నారు. ఈనెల రోజుల్లో దైవకార్యాలకు ఎంతోశక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
నోములు, వరలక్ష్మీ వ్రతాలు..
శ్రావణమాసం అంటే ప్రతీ మహిళకు ఇష్టమే. ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని మహిళలు కోరుకుంటారు. ఇల్లే దేవాలయంగా భావించి అమ్మవారిని ప్రతిష్టించి మంగళగౌరి నోములు, వరలక్ష్మీ వ్రతాలు, ఆచరిస్తారు. ఇంటింటా ప్రత్యేక పూజలతో పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. మంగళ, శుక్రవారాల్లో శ్రీలక్ష్మీదేవికి ఆలయాల్లో విశేష పూజలు, వ్రతాలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శివుని అభిషేకానికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతీ సోమవారం శ్రావణ సోమవార వ్రతం ఆచరించడం ద్వారా శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం. దూదీలపువ్వు, పాలు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల పాపాలు నివృత్తి అవుతాయి. తులసి, ధాన్యం, దానం, అన్నదానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది.
పండుగలు, ఉత్సవాలు
ఈ నెల 29న నాగపంచమి, ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మీ వ్రతం, 9వ తేదీన రాఖీ పండుగ, 16న శ్రీకృష్ణాష్టమి, 23న పొలాల అమావాస్య వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆగస్టు 22వ తేదీన ఐదో శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణం పూర్తయిన వెంటనే ఆగస్టు 27న వినాయకచవితితో భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.
విష్ణు పూజలకు ప్రసిద్ధి..
సర్వమంగళ కారియైన గౌరి, లక్ష్మీ, హరిహరులను విశేషంగా అర్చించే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. శ్రవణ నక్షత్రం మహావిష్ణువు జన్మ నక్షత్రం కావటంతో విష్ణు పూజలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలను అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. మంగళవారం గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణు పూజలు చేస్తారు.
శ్రావణమాసంలో ఇలా..
ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 4, 6, 10, 13, 15, 17, తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇన్నాళ్లు పెళ్లిళ్లు గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. శుక్రవారం నుంచి మంచిరోజులు వచ్చాయి. పురోహితుల నుంచి ఫొటోగ్రాఫర్లు, భాజాభజంత్రీలు, ఈవెంట్ల నిర్వాహకులు, వస్త్ర దుకాణాలు, పూలు, పండ్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు డిమాండ్ పెరగనుంది. నెలరోజుల పాటు శ్రీలక్ష్మీ అమ్మవారికి పూజలు చేయటంతో పాటు మహిళలు వ్రతాలు ఆచరిస్తారు. వివాహాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసం, విగ్రహల ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు.

శ్రావణం..శుభకరం..!