
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
లోకేశ్వరం: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన గాంధిరి భోజన్న (45) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం అప్పుచేసి కుమార్తె ప్రవళిక వివాహం జరిపించాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మనస్తాపంతో ఒకరు..
కాగజ్‌నగర్‌రూరల్: మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై సందీప్‌కుమా ర్ తెలిపిన వివరాల మేరకు కాగజ్‌నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన నస్పూరి రాంచందర్ (38) భార్య ఏడేళ్ల క్రితం అతన్ని విడిచిపెట్టి వెళ్లగా ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి పెద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అందవెల్లి, బోడపల్లి గ్రామాల మధ్య మృతదేహం కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తల్లి బాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
డబ్బులు వసూలు చేసిన ముఠా సభ్యుల అరెస్టు
తాంసి: తన సొంత ఎద్దులను విక్రయించేందుకు తీసుకెళ్తున్న రైతును బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఏడుగురు ముఠా సభ్యులపై కేసు నమోదు చేయగా నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ ఫణీందర్ తెలిపారు. తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన ఆత్మరాం గతేడాది సెప్టెంబర్ 23న మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనాన్ని అద్దెకు తీసుకుని తన పశువులను ఆదిలాబాద్‌లో విక్రయించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో పొన్నారి గ్రామ శివారులో ఆదిలాబాద్‌కు చెందిన రోహిత్ షిండే, విశ్వతేజ, ధగడ్‌సాయి, మహేష్, శివ, రమేశ్ వైరాగి, విజయ్ కేంద్రె వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్‌పై చేయి చేసుకోవడంతో పాటు రైతును బెదిరించి రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు మంగళవారం తాంసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
కార్మికశాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కార్మిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం కార్మిక శాఖ అధికారులు హాజరై ఆగస్టు 14న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో షెడ్యూల్‌తో హాజరు కావాలని చెబితే మళ్లీ ఎన్నికల తేదీ అంటూ నాటకాలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 28న ఎన్నికల షెడ్యూల్‌తో హాజరు కావాలని లేనిపక్షంలో ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమన్లు జారీ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య