
కేంద్రం నిధులతోనే పాఠశాలల అభివృద్ధి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో గురువారం క్లస్టర్ స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంశ్రీ పథకం ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. జవహర్ నవోదయ విద్యాలయంలో చదివిన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారని, ఉన్నత పదవులు అధిరోహించడం హర్షణీయమన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రీజినల్ లెవల్‌కు బాలుర విభాగంలో ఆరుగురు బాస్కెట్‌బాల్‌లో, హ్యాండ్ బాల్‌లో 9 మంది, వాలీబాల్ ఇద్దరు, బాలికల విభాగంలో బాస్కెట్ బాల్ నుంచి ముగ్గురు, హ్యాండ్‌బాల్‌లో ఏడుగురు, వాలీబాల్‌లో ఇద్దరు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అన్ని విభాగాల్లో 17 మంది బాలురు, 12 మంది బాలికలు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి 75 మంది బాలురు, 59 మంది బాలికలను రీజినల్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. క్లస్టర్ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 26న కేరళలోని కాసర్‌ఘడ్‌లో జరిగే వాలీబాల్, 27న విజయనగరంలో జరిగే హ్యాండ్‌బాల్, 28న రంగారెడ్డిలో జరిగే వాలీబాల్ రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ పార్వతి, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.