
తలకు దెబ్బతగిలితే...
సాధారణంగా తలకు దెబ్బతగిలినప్పుడు కొద్ది సెకన్లపాటు స్పృహకోల్పోవడం, తలనొప్పి, ఆయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మసక బారడం, చెవిలో హోరుమనే శబ్దం, రుచి తెలియక పోవడం, బాగా అలసటగా ఉన్నట్లు అనిపించడం, నిద్రవేళ ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపక శక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు సంభవిస్తాయి. తీవ్రగాయాలు అయితే వికారం, ఫిట్స్, మాట ముద్దగా రావడం, ఏదైనా అవయవంలో బలహీనత లేదా తిమ్మిర్లు, ఆలోచనలకు, చేతులకు సమన్వయం లోపించడం, తీవ్రమైన అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు బయటకు గాయంలేకపోయినా లోపల సమస్య ఏర్పడుతుంది. పుర్రెలో ప్రత్యేక ద్రావణంలో మెదడు తెలియాడుతూ ఉంటుంది. ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయమైతే మెదడు పుర్రె గోడలకు కొట్టుకుంటుంది. దీని వల్ల మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని హిమాటోమాకు దారితీసి తీవ్రరక్త స్రావం జరుగుతుంది.
– డాక్టర్ అభినవ్, జనరల్ ఫిజీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి, మంచిర్యాల