
హెల్మెట్ మస్ట్..!
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయ్య యాదవ్ తండ్రి ఐలయ్య యాదవ్ (64) ఈనెల 18న ద్విచక్రవాహనంపై హాజీపూర్ వైపు నుంచి మంచిర్యాలకు బయలుదేరాడు. పాత మంచిర్యాల వద్ద వెనుకనుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ ధరించి ఉంటే స్వల్ప గాయాలతో బయటపడేవాడని పలువురు చర్చించుకోవడం గమనార్హం.
మంచిర్యాలక్రైం: వాహనాలు మృత్యుఘటికలు మోగిస్తున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇతరులకు ప్రాణాంతకమవుతోంది. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతుండగా వందల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాల్లో 70 మంది మృతి చెందారు. ఇందులో అధికశాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, తదితర అంశాలపై నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులపై కొరడా ఝులిపిస్తున్నా మార్పురావడం లేదు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలతో బయటపడతారని అవగాహన కల్పిస్తున్నారు. అయినా వాహనదారుల్లో మార్పురావడంలేదు. కొంతమంది హెల్మె ట్ ధరించకుండా బైక్‌కు వెనకాల తగిలించుకుని రయ్‌మని వెళ్తున్నారు. తీరా ప్రమాదాలు జరిగిన తర్వాత హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని చర్చించుకోవడం ప్రజలవంతు అవుతోంది.
రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తం
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 70 మంది మృతి
హెల్మెట్ లేక మృతి చెందిన వారి సంఖ్యనే ఎక్కువ
నాసిరకం శిరస్త్రాణాలతో మొదటికే మోసం