
మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● భీమారంలో వనమహోత్సవం
భీమారం: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు పాటు పడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజలను కోరారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ తగ్గిన అడవుల స్థానంలో తిరిగి మొక్కలు నాటితే అవి భవిష్యత్‌లో దట్టమైన అడవులుగా మారుతాయని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల గదిని పరిశీలించి అందులో బెడ్స్‌పై ట్రంక్‌బాక్స్‌లు పెట్టారని, విద్యార్థులు ఎలా పడుకుంటారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. స్టాఫ్‌రూం, హెడ్మాస్టర్ రూం ఒకే దానిలో నిర్వహించి ఆ గది విద్యార్థులకు కేటాయించాలని ఆదేశించారు. గది మరమ్మతుకు వ్యయంపై అంచనాలు పంపించాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ విద్యాసాగర్‌ను ఆదేశించారు. డీఆర్డీవో కిషన్, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు
ఆరోగ్యశ్రీలో అనాథ పిల్లలకు రక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: అనాథ పిల్లల రక్షణ, ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్ జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, బాలల సంరక్షణ సమితి అధికారి ఆనంద్‌తో కలిసి అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. జిల్లాలోని ఆరు బాలల సంరక్షణ కేంద్రాల్లోని 85మంది అనాథ పిల్ల లకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త డాక్టర్ రాధిక పాల్గొన్నారు.
ఒప్పంద పద్ధతిన పోస్టుల భర్తీ
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం పరిధిలోని ఆసుపత్రుల్లో పోస్టులను ఒప్పంద సేవల పద్ధతిన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 9 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుల(జనరల్ మెడిసిన్ 2, గైనకాలజిస్ట్ 2, అనస్తీషియాలజీ 2, జనరల్ సర్జరీ 1, పిడియాట్రిక్స్ 2) పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు www.mancherial. telangana.gov.in
వెబ్‌సైట్‌లో సందర్శించాలని తెలిపారు.
టాస్క్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: టాస్క్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ ప్రాధాన్యత రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం టాస్క్ కేంద్రంలో ప్రపంచ యూత్ స్కిల్ డే పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.