
నీల్వాయి ప్రాజెక్టు
తక్కువ వర్షపాతంతో తగ్గిన ఇన్‌ఫ్లో
ఈ సీజన్‌లో ఇప్పటికీ 50శాతం లోటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వానాకాలం మొదలై నెల దాటుతున్నా ఆశించిన మేర వానలు కురవడం లేదు. ఈ సీజన్‌లో సకాలంలో వర్షాలు పడకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు సరిపడా నీరు రావడం లేదు. ఇటీవలే రాష్ట్ర స్థాయి సాగునీటి శాఖ అధికారులు ఆయా ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టును ప్రకటించారు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులకు ఇంకా నీరు వచ్చాక మరోసారి సమీక్ష చేశాకే ఆయకట్టు ప్రతిపాదించేలా నిర్ణయం తీసుకున్నారు. గోదావరి బేసిన్‌లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఈ నెల చివరి వరకు వేచి చూడనున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి చెరువులు, కుంటల్లో నీళ్లు మత్తడి దూకాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఉంది. ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో జిల్లాలో వరినారు సైతం కాస్త ఆలస్యంగా పోయడంతో వచ్చే నెలలోనూ నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అధికారులు సాగు నెల రోజుల రోజుల ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నప్పటికీ వర్షాభావ పరిస్థితులతో ఆరుతడి పంటలైన పత్తి వేసిన రైతులకే కాస్త ఊరట కలుగుతోంది. రోజుల తరబడి వర్షాలు కురవకపోయినా ఆరుతడి పంటలకూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
50శాతం లోటు వర్షపాతం
జిల్లాలో ఈ నెల 17నాటికి సాధారణ వర్షపాతం 327మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 164.3మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతం కన్నా 50శాతం లోటు నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడం లేదు. సాగునీరు రాక వానాకాలంలోనూ ఆయకట్టుకు భరోసా దక్కడం లేదు. మరోవైపు ర్యాలీవాగు, నీల్వాయి ప్రాజెక్టులు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించడం లేదు. ర్యాలీవాగులో సగం వరకు పూడికతో నిండిపోయి ఉంది.
నీల్వాయి ప్రాజెక్టు కాలువ పనులు సిద్ధం కాకపోవడంతో ఆయకట్టు తగ్గించాల్సి వస్తోంది. ఇక జిల్లాలో మొత్తం 634 చెరువులు ఉండగా వీటితో చాలా చెరువుల్లో పావుశాతం వరకు నిండాయి. మరోవైపు చెరువులు, కుంటలు నిండకపోవడంతో మత్స్యకారులు సైతం చేపపిల్లల విత్తనాలు విడుదలపైనా సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా ప్రైవేటుగా కొనుగోలు చేసి పెంచుకుని ఉపాధి పొందే వందలాది మంది మత్స్యకారులు సైతం వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో చెరువులు
చెరువులు, నిండిన శాతం
589, 0–25
37, 25–50
7, 50–70
1, 75–100

● తక్కువ వర్షపాతంతో తగ్గిన ఇన్‌ఫ్లో ● ఈ సీజన్‌లో ఇప్పటి