
ఆపరేషన్ మాకొద్దు..!
● కు.ని శస్త్రచికిత్సకు పురుషుల వెనుకంజ ● అవగాహన కల్పిస్తున్నా ముందుకొస్తున్నది కొందరే.. ● జిల్లాలో కుటుంబ నియంత్రణపై అవగాహన
మంచిర్యాలటౌన్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడానికి పురుషులు వెనుకంజ వేస్తున్నారు. పురిటి నొప్పులు భరించి.. ఆపరేషన్ ద్వారా పిల్లలకు జన్మనిస్తున్న తల్లులపైనే మళ్లీ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల భారం మోపుతున్నారు. ప్రతియేటా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 11నుంచి 18వరకు జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్లు, ఇతర మార్గాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ మహిళలు మాత్రమే ట్యూబెక్టమీ ఆపరేషన్ల(కు.ని)కు ముందుకు వస్తుండగా.. పురుషులు వ్యాసెక్టమీ ఆపరేషన్ల(కు.ని)కు ఆసక్తి చూపడం లేదు. కుటుంబ నియంత్రణ(వ్యాసెక్టమీ) ఆపరేషన్ చేయించుకునే పురుషులు ఐదు నిమిషాల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. పురుషులు వ్యాసెక్టమీ శస్త్రచికిత్స చేయించుకునేలా అవగాహన కల్పిస్తున్నా మహిళలతో పోలిస్తే ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య గత నాలుగేళ్లలో 50కి కూడా చేరలేదు. కుటుంబ నియంత్రణలో భాగంగా ఈ ఏడాది ప్రభుత్వం ‘శరీరం మరియు మనస్సు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆపరేషన్ సులభమైనా..
కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో పురుషులకు చేసే వ్యాసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభం. కోత, కుట్టు లేని శస్త్రచికిత్స ఇది. ఐదు నిమిషాల్లోనే పూర్తయ్యే ఈ విధానంలో రక్తస్రావం ఉండదు. ఆపరేషన్ అయిన వెంటనే చిన్న చిన్న పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పురుషులకు గతంలో కు.ని శస్త్రచికిత్స చేయాలంటే తప్పనిసరిగా కోత పెట్టాల్సి వచ్చేది. ఆధునిక విధానమైన నో స్కాల్‌పల్ వ్యాసెక్టమీ(ఎన్‌ఎస్‌వీ) అందుబాటులోకి రావడంతో ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఆపరేషన్ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికెళ్లవచ్చు. మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్‌లో ఎన్నో దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శస్త్రచికిత్స సమయంలో కూడా కడుపు కోత పెట్టాల్సి రావడంతో రక్తస్రావం అయ్యే ప్రమాదముంది. కుట్లు మానడానికి సమయం పడుతుంది. అప్పటికే ఒకట్రెండు కాన్పులు శస్త్రచికిత్స ద్వారా జరిగిన మహిళలకు కు.ని ఆపరేషన్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
వారం రోజులు అవగాహన
కుటుంబ నియంత్రణకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఆపరేషన్లు, ఇవి కాకుండా తాత్కాలికంగా పిల్లలు జన్మించకుండా చేపట్టే ప్రక్రియను వివరిస్తున్నారు. వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేసేందుకు జిల్లాలో వైద్యులు అందుబాటులో లేకపోవడం కూడా ఆపరేషన్లు తక్కువ నమోదు కావడానికి కారణంగా తెలుస్తోంది.
అవగాహన కల్పిస్తున్నాం
ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సలు చేసేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తాం. మహిళల కంటే పురుషులకు చేసే కు.ని ఆపరేషన్ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– డాక్టర్ హరీశ్‌రాజ్,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
జిల్లాలో గత ఐదేళ్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలు
సంవత్సరం మహిళలు పురుషులు
2021–22 760 82
2022–23 2,423 37
2023–24 2,588 37
2024–25 2421 90
2025–26 577 0

ఆపరేషన్ మాకొద్దు..!