
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వెనుకంజ
● రాష్ట్ర, జాతీయ స్థాయి ర్యాంకుల్లో చెన్నూర్, మంచిర్యాల మెరుగు ● చివరి స్థానంలో క్యాతనపల్లి
మంచిర్యాలటౌన్: స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీల్లో జిల్లాలోని ఏడు మున్సిపాల్టీలు వెనుకబడ్డాయి. రాష్ట్ర స్థాయిలో చెన్నూర్, జాతీయ స్థాయిలో మంచిర్యాల కాస్త మెరుగైన ర్యాంకులు సాధించాయి. రాష్ట్ర స్థాయిలో 64వ ర్యాంకుతో చెన్నూర్, జాతీయ స్థాయిలో 445వ ర్యాంకుతో మంచిర్యాల జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాయి. క్యాతనపల్లి రాష్ట్ర స్థాయిలో 136వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 1369వ ర్యాంకుతో జిల్లాలోనూ వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ఏటా ప్రకటిస్తుండగా.. జిల్లాలోని మున్సిపాల్టీలు అంతంత మాత్రంగానే సాధిస్తున్నాయి. స్వచ్ఛత విధానాల అమలులో వెనుకబడుతూనే ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటు(ఘన వ్యర్థాల నిర్వహణ), చెత్త ప్రాసెసింగ్, అండర్ డ్రెయినేజీ సిస్టం లేకపోవడం, మురుగునీటి శుద్ధీకరణ, డంపింగ్‌యార్డులు సక్రమంగా లేకపోవడం, ఉన్నవాటిలో తడి, పొడి చెత్తను వేరుచేయకుండా కలిపేస్తుండడం వంటి కారణాలతో మెరుగైన ర్యాంకులు సాధించలేకపోతున్నాయి. ఏడు మున్సిపాల్టీలు బహిరంగ మలమూత్ర విసర్జన(ఓడీఎఫ్) సాధించగా.. మంచిర్యాల, చెన్నూర్ ఓడీఎఫ్+ పొందాయి.
హడావుడి కార్యక్రమాలు..
ఏటా కేంద్ర బృందం మున్సిపాలిటీల్లో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం అందిస్తున్నాయా లేదా అని పరిశీలిస్తారు. వీటితోపాటు ఓవరాల్‌గా 7500 మార్కులతో ఆయా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు, ఘన వ్యర్థాల నిర్వహణ, బహిరంగ మల మూత్ర విసర్జన, చెత్త రహిత నగరం, నగర జనాభాకు తగినట్లుగా మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించి మార్కులు వేస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సమయంలో మాత్రమే మున్సిపల్ అధికారులు హడావుడిగా పారిశుద్ధ్యం మెరుగునకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి అమలు చేసేలా చర్యలు తీసుకోలేకపోయారు. ఏడాదంతా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటేనే రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే మంచిర్యాల కొంత మెరుగైంది. గతేడాది రాష్ట్రస్థాయిలో 121వ ర్యాంకు సాధించగా, ఈ ఏడాది 72వ ర్యాంకు దక్కించుకుంది.