పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
ఓ వైపు పచ్చని అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు.. మరోవైపు పురాతన ఆలయాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అడవి దున్నలు, చిరుతలతో పాటు జింకలు, నీలుగాయిలు ఇతర వన్యప్రాణులకు నిలయంగా కవ్వాల్ అభయారణ్యం నిలుస్తోంది. గిరిజన పోరాట స్ఫూర్తిని తెలిపే కుమురంభీం స్మారకం, జైన శిల్పకళతో నిర్మించిన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం, పాండవులు వనవాసం చేసిన పెద్దయ్య దేవుడి గుట్ట, గోదావరి ఒడ్డున వెలిసిన సత్యదేవుని ఆలయం, బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయం పర్యాటకంగా కీలకమైన ప్రాంతాలు. వేసవి సెలవుల్లో ఉమ్మడి జిల్లాలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రాంతాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
జన్నారం అటవీ డివిజన్‌లో చుక్కల దుప్పులు
ఆదిలాబాద్‌టౌన్: దేశంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఉంది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆలయ విశిష్టత
మహారాష్ట్రాలోని వెమత్మాలపంత్ రాతి తో ఈ ఆ లయం నిర్మించారు. ఉన్నత శిఖరం కలిగి అడుగడుగునా శిల్పకళతో శోభితమైంది. 60 గజాల ఎ త్తు, 40 గజాల వైశాల్యమున్న అష్టకోణాకార మండపము పైనున్న గర్భగుడిలో సూర్యనారా యణ స్వామి విగ్రహం ప్రతిష్టించబడి ఉంది. మూలవిరాట్లు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహానికి దక్షిణ దిశలో లక్ష్మీదేవి, హల్వారులు, అన్యదేవత మూర్తులు ఉన్నారు. ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయానికి ఇరువైపులా శృంగార భంగిమలతో కూడిన శిల్పఖండాలు దర్శనమిస్తాయి.
స్వామి పాదాలను తాకే భానుడి కిరణాలు..
ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో, దసరా అనంతరం అశ్వియుజ పౌర్ణమిరోజు ఉదయం లక్ష్మీనారాయణ పాదాల ను సూర్యకిరణాలు తాకుతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూ ర్యదేవాలయంగా కూడా పిలు స్తారు. ఈ అద్భుత దృశ్యం చూడటానికి రాష్ట్ర నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు.
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టలు పుణ్యక్షేత్రాలకు నిలయంగా మారాయి. గుట్టపై వెలసిన సత్యనారాయణ స్వామి ఆలయం తె లంగాణలోనే ప్రసిద్ధి గాంచింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు గోవర్దన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ సమీపంలోనే పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఎత్తయిన కొండపై అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. గుట్ట కింద షిర్డి సాయినాథుని ఆలయం ఉంది. ఇలా ఒకే చోటా ఇన్ని ఆలయాలు ఉండటంతో గూడెం గ్రామం పుణ్య క్షేత్రాలకు నిలయంగా మారింది. సత్యదేవుని ఆలయంలో ప్రతీ పౌర్ణమికి జాతర నిర్వహిస్తారు. మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా నేరుగా రావచ్చు.
జన్నారం: దట్టమైన అడవులు, పచ్చదనం పంచుతున్న చెట్లు, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు కేరాఫ్‌గా కవ్వాల్ టైగర్‌జోన్‌కు పేరుంది. 982 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాలో విస్తరించి ఉంది. పక్షుల కిలకిలలు, వన్యప్రాణుల పరుగులు, వాగుల గలగలలు ఇవన్నీ కలగలిపిన సంపదే కవ్వాల్ టైగర్‌జోన్. దీనికి గుండెకాయ జన్నారం అటవీ డివిజన్.
సఫారీ ప్రయాణం
పర్యాటకులను అడవిలో తిప్పేందుకు అటవీ శా ఖ, పర్యాటక శాఖలు సఫారీల ను ఏర్పాటు చేశా యి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఐదు లగ్జరీ సఫా రీలు, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండు సఫా రీలను ఏ ర్పాటు చేశారు. పర్యటక శాఖ ఏర్పా టు చేసిన రిసార్ట్స్‌లో రాత్రి బసచేసి, ఉదయా న్నే అడవిలో సఫారీ ప్రయాణం చేస్తారు. ఉదయం 7 నుంచి 10 గంటలకు, 10 నుంచి ఒంటిగంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి అడవిలో సుమారు 15 కి లోమీటర్ల దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. వన్యప్రాణుల పరుగులు, పక్షుల కిలకిలలు నేరుగా చూడవచ్చు. పచ్చదనం పంచుకున్న అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హరిత రిసార్ట్‌లో పర్యాటకుల కోసం కార్టేజీలను ఏ ర్పాటు చేశారు.
ఇలా వెళ్లాలి..
మంచిర్యాల నుంచి గంటకో బస్సు ఉంటుంది. మంచిర్యాల నుంచి 60 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్లు, నిర్మల్ నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కాకుండా నేరుగా సొంత వాహనాలతో కూడ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సొంత వాహనాలకు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలకు అనుమతి ఉండదు. అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేస్తారు.
దట్టమైన అడవిలో
పెద్దయ్య ఆలయం
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో రెండు గుట్టల నడుమ గలగలా పారే సెలయేరు ఒడ్డున పెద్దయ్యదేవుని ఆలయం ఉంది. ద్వాపర యుగంలో ఇక్కడ పాండవులు వనవాసం చేశారని పూర్వీకులు చెబుతుంటారు. ప్రతీ గురు, ఆదివారాల్లో ఇక్కడ జాతర జరుగుతుంది. జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక్కడ గిరిజనులే పూజారులు. ప్రతీ ఖరీప్, రబీ సీజన్ల ప్రారంభంలో రైతులు పెద్దయ్య దేవున్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆలయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వస్తుంటారు.
ఆకట్టుకుంటున్న ‘జోడేఘాట్’
కెరమెరి(ఆసిఫాబాద్): భూమి, నీరు, అడవి నినాదాలతో పోరాడి అసువులు బాసిన కుమురం భీం పోరుగడ్డ జోడేఘాట్ పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుమారు 35 ఏళ్లుగా ఆదివాసీలు జోడేఘాట్‌లో భీం వర్ధంతిని నిర్వహించి నివాళి అర్పిస్తున్నారు. 2016లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులతో నిలువెత్తు భీం విగ్రహం, స్మృతివనం, స్మృతిచిహ్నం, జల్, జంగల్, జమీన్‌ల ఆర్చీలను ఏర్పాటు చేసింది. సమాధి నిర్మాణం చేసింది. జోడేఘాట్ నుంచి టోకెన్‌మోవాడ్ వరకు తారురోడ్డు, భీం మ్యూజియం నిర్మించింది. అందులో కుమురంభీం, అతని సహచరుల ప్రతిమలు, గుస్సాడీలు చేస్తున్న నృత్యాలు, ఆదివాసీ ఆభరణాలు, ఆయుధాలు, దేవతల మండపాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి జోడేఘాట్ ప్రాచూర్యంలోకి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, ఏటూరు నాగారం, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజురా, బల్లార్షా, పాండర్‌కవడా, తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు జోడేఘాట్ అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఇలా వెళ్లవచ్చు..
ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో కెరమెరికి రెండు కిలో మీటర్లు ముందుగానే హట్టి స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి జోడేఘాట్ 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లేనప్పటికీ ప్రైవేటు వాహనాలు నడుస్తాయి. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు వెళ్లే మార్గంలో కెరమెరి తర్వాత వచ్చే హట్టిలో దిగాల్సి ఉంటుంది.
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పాతమంచిర్యాల అటవీ బీట్ పరిధిలోని హాజీపూర్ మండలం గఢ్‌పూర్ గ్రామ శివారు ఎంసీసీ క్వారీ లోని అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ సఫారీలో పాతమంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట అటవీబీట్ అడవులు ఉన్నా యి. 30 హెక్టార్లలో గ్రాస్‌ప్లాంట్, 30 హె క్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. పర్యాటకులు అడవిఅందాలు, వన్యప్రాణులను వీక్షి ంచేందుకు 6 మంచెలు ఏర్పాటు చేశారు. రెండున్నర గంటలపాటు 25 కిలోమీటర్ల మేర జంగల్ సఫారీ సాగుతుంది. ఆరుగురికి ఒక్కట్రిప్పుకు రూ.2,100, అదన పు వ్యక్తికి రూ.350, ట్రెక్కింగ్‌కు రూ.200లు తీసుకుంటున్నారు. ఉదయం 6:30, 9:30 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రిప్పులు ఉన్నాయి.
నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లా
బాసర సరస్వతీ మాత ఆలయం
నిర్మల్/కడెం/సారంగపూర్: నిర్మల్ జిల్లాలో అణువణువునా ప్రత్యేకతలున్న పర్యాటక, దర్శనీయ స్థలాలు ఉన్నా యి. బాసరలో గోదారి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు. నిర్మల్–భైంసా మీదుగా, నిజామాబాద్ మీదుగా బాసర చేరుకోవచ్చు. బస్సులతో పాటు రైల్వే సౌకర్యమూ ఉంది.
కదిలె.. పాపహరేశ్వరుడు
దిలావర్‌పూర్ మండలంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో వెలిసిన దర్శనీయ స్థలం కదిలె. దిలావర్‌పూర్ నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. దిలావర్‌పూర్ నుంచి 4కి.మీ దూరంలో కదిలె ఆలయం ఉంటుంది.
కొయ్యబొమ్మల ఖిల్లా.. నిర్మల్
కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. నిమ్మనాయుడు కాలంలో వచ్చిన నకాశీలు ఇప్పటికీ ఈ కళను నమ్ముకుని జీవిస్తున్నారు.
‘కడెం’ ఒడ్డున సేదదీరాల్సిందే..
నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 50 కి.మీ దూరంలో కడెం నదిపై ప్రాజెక్టు నిర్మించారు. పాపికొండలను తలపించే పచ్చని కొండల మధ్య ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఉంటుంది. ఆ అందాలను ఆస్వాదించేందుకు ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది. ప్రాజెక్టు పక్కనే రిసార్టులు ఉన్నాయి. నిర్మల్ నుంచి 48 కి.మీ, మంచిర్యాల నుంచి 90 కి.మీ, ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
పుణ్యక్షేత్రాల గూడెం..
నమోః సూర్య నారాయణ
విహారయాత్రగా జంగల్ సఫారీ
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్


