
అటవీ అధికారులతో రైతుల వాగ్వాదం
భీమారం: మండలంలోని అంకూసాపూర్ శివారు 140 సర్వేనంబర్‌లోని వివాదాస్పద భూముల్లో కందకాలు తీసేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. బుధవారం అధికారులు పోలీసుల సహకారంతో కందకాలు తీసే పనులు చేపట్టారు. గత 50 ఏళ్ల నుంచి తాము ఈ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తవ్వకాలు ఎలా చేపడుతారని అటవీశాఖ అధికారులను రైతులు నిలదీశారు. మంచిర్యాల రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ మాట్లాడుతూ అటవీశాఖ భూములు కాబట్టే పనులు చేపట్టామని, అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని తెలిపారు. తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, గతంలో జరిగిన సభల్లో దరఖాస్తులు ఇచ్చామని రైతులు తెలిపారు. అనంతరం ఎస్సై రాములు నేతృత్వంలో పోలీసు బందోబస్తు మధ్య కందకాలు తీసే పనులు చేపట్టారు. కాగా, 10 ఎకరాల్లో వరి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారని రైతులు దర్శనాల రాజేశ్వరి, మధూకర్ ఆరోపించారు.