తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండ‌గా.. దూసుకొచ్చిన మృత్యువు! | - | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండ‌గా.. దూసుకొచ్చిన మృత్యువు!

Jan 1 2024 2:06 AM | Updated on Jan 1 2024 12:25 PM

- - Sakshi

ఢీ కొట్టిన వ్యాన్‌

మంచిర్యాల: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రార్థనల్లో చర్చికి వెళ్తున్న తల్లీకూతురుపైకి లారీ మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. జాతీయ రహదారి దాటుతుండగా ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కాసిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని నస్పూర్‌కు చెందిన వేల్పుల నిర్మల(44), వేల్పుల స్వాతి(21) ప్రార్థనల కోసం కాసిపేట సమీపంలోని కల్వరి బయల్దేరారు.

చర్చి సమీపంలో రాత్రి వాహనం దిగి రోడ్డు దాటుతుండగా మందమర్రి నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న బొలేరో వ్యాన్‌ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ చర్చి సమీపంలోనే ఘటన జరుగడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిని 108లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వద్ద ఉన్న బ్యాగ్‌లో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతులు నస్పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇదిలా ఉండగా ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సీఐ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి చ‌ద‌వండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్ర‌మాదం! పొగ మంచు, అతివేగమే కారణమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement