పాన్‌గల్: మండలంలోని చింతకుంట గ్రామంలో ఆదివారం నాగుపాము కలకలం సృష్టించింది. స్థానికుల తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదగిరిస్వామి ఇంటి ఆవరణలో కోళ్ల కోసం ఏర్పాటు చేసిన గూటిలోకి నాగుపాము చేరింది. ఈ క్రమంలో అక్కడ పొదుగుతున్న కోడిపెట్టను కాటువేయడంతో కోడి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం 9 గుడ్లను నాగుపాము మింగేసింది. గుడ్లని మింగేసి కదల్లేని స్థితిలో ఉన్న పామును గమనించిన యాదగిరిస్వామి సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించగా, ఆయన తన బృందంతో కలిసి పామును పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు చిలుక కుమార్‌సాగర్, స్వామిగౌడ్ పాల్గొన్నారు.
అమ్మవారి చెంత
భక్తుల సందడి
నవాబుపేట: మండలంలోని పర్వాతాపూర్ మైసమ్మ ఆలయం చెంత భక్త జన జాతర కొనసాగింది. ఆదివారం పెద్ద ఎత్తున జనం మైసమ్మ అడవికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. దీంతో అడవి మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. ఆదివారం సెలవు పైగా అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో మైసమ్మ ఆలయం మొత్తం కిటకిటలాడింది. కాగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజారులు భక్తులకు దర్శనం ఇప్పించారు.
డ్రిప్ పైపుల అపహరణ
గద్వాల క్రైం: వ్యవసాయ పొలాల వద్ద నిల్వ ఉంచిన డ్రిప్ పైపులను అపహరించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాలు.. గద్వాల మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన రంగన్న, మునిస్వామి, కిష్టన్న గ్రామ శివారులోని తమ పొలాల్లో రూ.2 లక్షల విలువ చేసే డ్రిప్ పైపులను నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు తెల్లవారు జామున పైపులను చోరీ చేశారు. చోరీపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు.
పల్లెప్రకృతివనం దగ్ధం
తెలకపల్లి: మండలంలోని లక్నారంలో ప్రమాదవశాత్తు పల్లె ప్రకృతి వనానికి నిప్పంటుకుని దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లె ప్రకృతి వనం చెత్తచెదారం నిండిపోయింది. శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లు కాలిబూడిదయ్యాయి. కార్యదర్శికి సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు.


