విద్యుదాఘాతంతో బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

కొత్తకోట రూరల్‌: గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ట్రానన్స్‌ఫార్మర్‌ వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఐదేళ్ల బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మండలంలోని కానాయపల్లిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల జ్యోతి, యాదగిరి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, చిన్న కుమారుడు తరుణ్‌(5) ఆదివారం ఇంటి సమీపంలో రోడ్డుపక్కన ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన ఎర్త్‌ వైర్‌ కాలుకు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బాలుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడి ప్రాణం పోయిందంటూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివానందంగౌడ్‌ ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. బాలుడి మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బావపై కత్తితో దాడి చేసిన బావమర్ది

కొల్లాపూర్‌: బావపై బామర్ది కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్‌ గ్రామానికి చెందిన కటికే విజయ్‌ తన భార్యను నిత్యం వేధిస్తూ కొట్టేవాడు. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భార్యను కొట్టాడు. ఈ విషయాన్ని ఆమె పుట్టింటివారికి సమాచారం ఇచ్చింది. ఆమె తమ్ముడు అదేరోజు రాత్రి బావ కళ్లలో కారం పొడి చల్లి కొట్టి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడు విజయ్‌ రక్తస్రావంతో బయటకు పరుగులు తీసి స్థానికుల సహాయంతో కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌ అత్తను, మరదలిని అదుపులోకి తీసుకున్నామని బామర్ది పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడ పట్టుకొని కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ

మహిళ మృతి

ఉప్పునుంతల: మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన మద్దెల చెన్నమ్మ(64) మహిళ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఏఎస్‌ఐ రెడ్యానాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం చెన్నమ్మ ఈనెల 9న గ్రామ శివారులోని పెద్దకుంట వద్దకు ఉపాధి పనులకు వెళ్లి తిరిగి తన భర్త మద్దెల పెద్దులయ్యతో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కిందపడి తలకు బలమైన రక్త గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు మద్దెల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement