● పౌల్ట్రీ ఫాంకు నిలిచిన విద్యుత్ సరఫరా
● కోళ్ల మృతితో రూ.12లక్షల నష్టం
అమరచింత: పౌల్ట్రీ ఫాంలో పెంచుతున్న ఫారం కోళ్లకు విద్యుత్ సరఫరా లేని కారణంగా ఉక్కపోత భరించలేక 6వేల కోళ్లు మృతిచెందిన ఘటన మండలంలోని నందిమళ్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజాసింహారెడ్డి ఎకరం పొలంలో రెండుషెడ్‌లు వేసుకుని వాటిలో కోళ్లు పెంచుతున్నాడు. 10వేల కోళ్లను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వేసవి కావడంతో కూలింగ్ కోసం స్ప్రింక్లర్లు, ఫ్యాన్‌లను ఏర్పాటు చేసుకుని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పోషిస్తున్నాడు. శనివారం ఉదయం షెడ్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విషయాన్ని లైన్‌మెన్ దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని.. విద్యుత్ స్తంభానికి వైర్ తెగిందని తెలిపినా నిర్లక్ష్యం చేశాడని వెల్లడించారు. వేసవికాలం కావడంతో తీవ్రమైన ఎండ వేడిమికి కోళ్లు తట్టుకోలేకపోయాయి. కాపాడుకుందామని ప్రయత్నించినా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఉక్కపోతతో మృతిచెందినట్లు పేర్కొన్నాడు. ఇలా వందల సంఖ్యలో కోళ్లు చనిపోతుంటే రైతు తట్టుకోలేక పోయాడు. వాటికి బలికించుకుందామనే సమయంలోనే సాయంత్రం నాలుగు గంటల వరకు 10వేల కోళ్లలో 6వేల కోళ్లు మృతిచెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని సర్పంచ్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఘటనకు పూర్తి బాధ్యత ట్రాన్స్‌కో అధికారులు వహించాలని డిమాండ్ చేశారు.
చేతికొచ్చిన కోళ్లు..
ఎకరం పొలంలో రెండు షెడ్‌లు వేసుకుని 10వేల కోళ్లు పెంచుకుంటున్నా. సదరు కంపెనీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కోళ్ల సరఫరా చేస్తున్నా. శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే 6వేల కోళ్లు చనిపోయాయి. దీంతో రూ.12లక్షల నష్టం కలిగింది. అప్పులు చేసి ఫౌల్ట్రీ ఫాం నడుపుతున్న తనను ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజాసింహారెడ్డి,
పౌల్ట్రీ ఫాం నిర్వాహకుడు, నందిమళ్ల


