కల్వకుర్తి రూరల్: పోలీసుల తనిఖీలలో 25 గ్రాముల గాంజా పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కల్వకుర్తి మండలం మార్చాలా గ్రామ సమీపంలో ఉన్న సూర్యలత కాటన్ మిల్, ఊరుకొండ పేట కాటన్ మిల్లులో నివాసం ఉంటున్న కార్మికుల క్వార్టర్లలో సోదాలు నిర్వహించారు. కల్వకుర్తి మిల్లులో 10 గ్రాముల గాంజా లభించగా ఊరుకొండ పేట మిల్లులో 15 గ్రాముల గాంజా లభించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువకులు గాంజా, ఇతర మాదక ద్రవ్యాలు అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కల్వకుర్తిలో 360 క్వార్టర్లు, ఊరుకొండ పేటలో 500 మంది వ్యక్తులను తనిఖీ చేశామని డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ తనిఖీలలో పలువురు ఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


