క్రీడాకారులకు అభినందనలు..
● తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం
● వాకోవర్‌తో మూడోస్థానంలో
నిలిచిన ఉత్తరాఖండ్
● క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి చాటారు : డీఈఓ ప్రవీణ్‌కుమార్
జడ్చర్ల టౌన్: ఎస్‌జీఎఫ్ 69వ జాతీయ క్రికెట్ చాంపియన్‌గా ఢిల్లీ జట్టు నిలిచింది. గత నెల 26న ప్రారంభమైన టోర్నమెంట్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరిగాయి. శుక్రవారం జడ్చర్ల మినీ స్టేడియం మైదానంలో ఢిల్లీ– తమిళనాడు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. జట్టులో తమిళ్ సెల్వమ్ 46 పరుగులు చేయగా ఆకాష్ 3 వికెట్లు తీశాడు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 148 పరుగులు చేసింది. జట్టులో యువరాజ్‌శర్మ 59 పరుగులు చేయగా బౌలింగ్‌లో రిశాంత్ 2 వికెట్లు తీశాడు. 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. దీంతో ఢిల్లీ క్రీడాకారులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని సంబరాలు చేసుకున్నారు.
మొదటి సెమీ ఫైనల్‌లో..
జడ్చర్ల మినీ స్టేడియంలో ఢిల్లీ– ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో ఢిల్లీ సత్తాచాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. జట్టులో ఆష్మిత్ 37 బంతుల్లో 65 పరుగులు, రాహుల్ 34 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించేలా కృషిచేశారు. బౌలింగ్‌లో కునల్, ఆరుష్‌శర్మ చెరో 2 వికెట్లు తీశారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ జట్టు 18.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్‌లో రాహుల్ 4, ఆకాష్ 3 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు.
తమిళనాడు విజయం..
తమిళనాడు డీఏవీ సీఎంసీ జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో తమిళనాడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేయగా 121 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన డీఏవీ సీఎంసీ జట్టు 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో విపుల్ 44 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన తమిళనాడు ఫైనల్‌కు చేరుకుంది.
వాకోవర్‌తో మూడోస్థానం..
టోర్నీలో మూడోస్థానం కోసం ఉత్తరాఖండ్– డీఏవీ సీఎంసీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. డీఏవీ సీఎంసీ జట్టు ఫ్‌లైట్ టైం అవుతుందని వాకోవర్ ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో ఉత్తరాఖండ్ మూడోస్థానం ఖరారైంది. అయితే మ్యాచ్ 10 ఓవర్లు జరిగినప్పటికీ ఇరు జట్లు అంగీకరించడంతో వాకోవర్ ప్రకటించారు.
మండుటెండల్లోనూ టోర్నీ విజయవంతమైందని మహబూబ్‌నగర్ డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. టోర్ని ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడేళ్లుగా టోర్నీ నిర్వ హణకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, అలాంటిది జడ్చర్ల ముందుకు రావడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు అందరూ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. చిన్నపాటి పొరపా ట్లు జరిగినప్పటికీ టోర్నీ జయప్రదం అయ్యేందుకు కారణమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. గెలిచిన వారు భవిష్యత్‌లోనూ రాణించి దేశానికి పేరు తీసుకురావాలని, ఓడిన వారు గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత మాట్లాడుతూ గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు సభలో టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శారదాబాయి, నిర్వాహకుడు మోయిన్, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


