‘పండు ఈగను నివారిద్దాం’ | - | Sakshi
Sakshi News home page

‘పండు ఈగను నివారిద్దాం’

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

అలంపూర్‌: పండ్లు, కూరగాయల తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రధానంగా మామిడిలో కాయలు పక్వానికి వచ్చే దశలో పండు ఈగ సోకితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ పండు ఈగ వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ వివరించారు.

నష్టాలు:

తల్లి ఈగలు కాయ పక్వానికి వచ్చే దశలో 150 నుంచి 250 గుడ్లను కాయ లోపలి భాగంలో పెడతాయి. 4 రోజుల్లో గుడ్ల నుంచి పిల్ల లార్వాలు బయటికి వచ్చి కాయ లోపలి కండ, మాగుతున్న గుజ్జును తింటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉంటాయి. పిల్ల పురుగులు సంచిరించిన ప్రాంతం కుళ్లి మెత్తబడుతుంది. కాయ, పండ్లపై సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. పండ్లు రాలిపోతాయి.

పండు ఈగ నివారణ :

పండు ఈగ సోకి రాలిన పండ్లు, కాయలను వారానికి ఒకసారి ఏరి నేలలో పూడ్చిపెట్టాలి. దీని వలన పిల్ల పురుగులు చనిపోతాయి. వరుసల మధ్య సేద్యం చేయడం వలన కోశస్థ దశలో పురుగులు బయటపడి పక్షులు తినడం వలన చనిపోతాయి.

ఫెరమాను బోనుతో లాభాలు

రెండు రంధ్రాలు గల ప్లాస్టిక్‌ ఫెరమాను బోనులో మగ ఈగను ఆకర్షించే రసాయనాలు పూసిన అట్ట ముక్క ఉంటుంది. ఈ ముక్కపై 8 చుక్కల నువాన్‌ లేదా మలాథియాన్‌ పిల్లర్‌తో వదిలి ఉంచుతారు. తర్వాత ప్లాస్టిక్‌ డబ్బాకు మూతను బిగించి, చెట్టు కొమ్మకు వేలాడదీయాలి. అట్ట ముక్కకు ఉన్న రసాయనాలకు మగ ఈగ ఆకర్షింపబడి డబ్బాలోకి వచ్చి మందు ప్రభావానికి గురై చనిపోతాయి.

ఫెరాబోను వాడే పద్ధతి :

● ఫెరాబోన్లను కాయ పక్వానికి చేరువయ్యే దశకు కనీసం 60 రోజుల ముందు చెట్లకు వేలాడదీయాలి.

● బోన్లను 3 నుంచి 4 అడుగుల ఎత్తులో నీడ ఉండేలా చూసి కొమ్మలకు కట్టాలి.

● దీని వలన మందు ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుంది.

● అప్పుడప్పుడు బోనులో ఉన్న మగ ఈగలను తీసేయాలి.

● అట్ట ముక్కపై వేసిన పురుగు మందు ప్రభావం 12 రోజులు ఉంటుంది.

● 12 రోజుల తర్వాత అట్ట ముక్కపై 5 నుంచి 6 చుక్కల నువాన్‌ లేదా మలాథియాన్‌ వేసి మరల ప్లాస్టిక్‌ డబ్బాకు మూత పెట్టాలి.

ఫెరబోను లభించే ప్రదేశాలు

రెయిన్‌బో అగ్రివెట్‌ టెక్నాలజీ బెంగుళూరు వారు వీటిని సరఫరా చేస్తారు. కావాల్సిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement