గొర్రెల దొంగ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గొర్రెల దొంగ బీభత్సం

Mar 23 2026 9:02 AM | Updated on Mar 23 2026 9:02 AM

పట్టుకునే ప్రయత్నంలో

హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలు

కారు వదిలి పారిపోయిన నిందితుడు

కారులో కత్తి, సెల్‌ఫోన్‌ స్వాధీనం

మాగనూర్‌: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు అతిసమీపంలో గొర్రెల దొంగలు బీభత్సం సృష్టించారు. వారి పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్‌ కానిస్టేబుల్‌ను తోసివేయడంతో గాయాలైన ఘటన శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ పి.అశోక్‌బాబు వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వద్ద మక్తల్‌ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన కొందరు తమ గొర్రెల మంద ఆపి పడుకున్నారు. ఈ క్రమంలో డయల్‌ 100 సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుండగా గొర్రెల అలజడి కనిపించి అనుమానం వచ్చి అటు వెళ్లగా.. ఓ వ్యక్తి గొర్రెలను అపహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారు దొంగను పట్టుకునేందుకు వెళ్లగా అతడు సమీపంలో నిలిపి ఉంచిన కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. డయల్‌ 100 సిబ్బంది ఎస్‌ఐతో కలిసి కారును వెంబడిస్తూ కర్ణాటక రాష్ట్రం దేవసూగురుకు వెళ్లగా.. నిందితుడు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ప్రతిదాడికి దిగడంతో దొంగ మళ్లీ మాగనూర్‌ వైపు రావడంతో ఎస్‌ఐ మాగనూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి జాతీయ రహదారిపై లారీ, బస్సును అడ్డుగా ఉంచారు. దీంతో దొంగ తప్పించుకునే ప్రయత్నంలో బస్సును కారుతో వేగంగా ఢీకొట్టాడు. అనంతరం కారు దిగి పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్‌కానిస్టేబుల్‌ ఉమేష్‌గౌడ్‌ను దొంగ బలంగా రోడ్డుపై తోసివేయడంతో ఆయనకు తల, చేతికి గాయాలయ్యాయి. దొంగ పక్కనే ఉన్న చెరువులోకి దూకి పారిపోయాడు. చాలా సేపు చెరువు పరిసరాల్లో వెతికినా దొంగ జాడ దొరకలేదని ఎస్‌ఐ తెలిపారు. దొంగ వినియోగించిన కారును స్వాధీనం చేసుకోని నంబర్‌ ప్లేట్‌పై వేసిన బ్లాక్‌ స్టికర్‌ను తొలగించారు. కారులో ఓ సెల్‌ఫోన్‌తో పాటు కత్తి లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ను గాయపర్చడంతో పాటు దొంగతనానికి యత్నించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement