● ట్రాక్టర్‌ను ఢీకొట్టిన
ద్విచక్ర వాహనం
గట్టు: రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను చీకటిలో బైకు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక యువకులు మృతి చెందిన ఘటన బల్గెర సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. కర్నూలు– రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి బల్గెర సమీపం(అయిజ వైపు)లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు తిమ్మప్ప(35), ఓగులప్ప(40)లు మృత్యువాత పడ్డారు. మాచర్లకు చెందిన ట్రాక్టర్ యజమాని ముక్కెరయ్య చిన్నోనిపల్లెలో కంకర అన్‌లోడ్ చేసి మాచర్లకు బయలు దేరాడు. బల్గెర సమీపంలో కాల్వకు కొద్ది దూరంలో చీకట్లో ఓ కారు ఆగి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న క్రమంలో ట్రాక్టర్‌ను రోడ్డు పక్కనే ఆపి, కారులో ఉన్న వారికి సహాయం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కర్ణాటకలో దేవనపల్లెకు చెందిన తిమ్మప్ప, ఓగులప్ప వరి కోతలకు సంబంధించి అయిజ మండలం తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రైతులను కలసి వరికోత మిషన్‌ను తీసుకొచ్చేందుకు స్వగ్రామం దేవనపల్లెకు బైకుపై బయలు దేరగా బల్గెర వద్ద కాల్వకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన నిలిచిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరు అక్కడకక్కడే మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను గద్వాల ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్ తెలిపారు.


