గోపాల్‌పేట: మండలంలోని తాడిపర్తి చెరువు నుంచి శనివారం మొసలి ఒడ్డుకు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొసలిని చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఆరు నెలల క్రితం మొసలి తాడిపర్తి చెరువు ఒడ్డుకు రాగా.. ప్రజలు స్నేక్ సొసైటీ ఫౌండర్ క్రిష్ణసాగర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి వచ్చేలోపు చెరువులోకి వెళ్లిపోయింది. శనివారం ఉదయం మరోసారి మొసలి బయటికి రావడంతో స్థానికులు కేకలు వేయడంతో మళ్లీ చెరువులోకి వెళ్లిపోయింది. మొసలి పెద్దగా ఉందని చిన్నపిల్లలు, పెద్దలు ఎవరూ ఈతకు వెళ్లడం, పశువులను నీళ్లకు తీసుకువెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని మొసలిని పట్టుకుని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు.
కల్వరాలలో..
వీపనగండ్ల: మండలంలోని కల్వరాల అమ్మ చెరువులో మొసలి సంచరిస్తుండడంతో సమీప పంట పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువులో సంచరిస్తున్న మొసలి రాత్రి వేళలో సమీప పంట పొలాల్లోకి వచ్చి నివాసం ఉటుండంతో ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందోనని పలువురు రైతులు పొలా లకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మొసలిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని, చెరువు సమీపంలో హెచ్చరిక బో ర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


