పాన్‌గల్: చింతచెట్టుపై నుంచి కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాన్‌గల్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గెంటీల తెలుగు నర్సింహ(54) ఈ నెల 4న గ్రామ శివారులో చింతచెట్టు పైన చింతపండు తెంపుతుండగా ప్రమాదవశాత్తుతో కాలు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అనంతరం మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని మత్స్యకార సంఘం నాయకులు పరామర్శించి సానుభూతిని తెలిపారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు.
కారు, బైక్ ఢీ: ఒకరు దుర్మరణం
● ఇద్దరికి తీవ్రగాయాలు
అమ్రాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి అమ్రాబాద్ సమీపంలో మద్దిమడుగు రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబావి గ్రామానికి చెందిన చాంద్‌పాషా(21), పర్వతాలు, వెంకటేష్‌లు బైక్‌పై రాత్రి తమ గ్రామం వెంకటేశ్వర్లబావి వెళ్తుండగా మన్ననూర్ నుంచి అమ్రాబాద్ వైపు వస్తున్న కారు మార్గమధ్యలో అమ్రాబాద్ సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాంద్‌పాషా మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేష్, పర్వతాలుకు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు.


