● నేడు ‘ఈద్ ఉల్ ఫితర్’
● ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
● ముగిసిన రంజాన్ ఉపవాసాలు
జోరుగా
సామగ్రి కొనుగోళ్లు...
రంజాన్ మాసంలో జిల్లా కేంద్రంలోని వ్యాపార కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు రోజూ రాత్రి 12 గంటల వరకు షాపులను తెరచి ఉంచారు. గత మూడు రోజుల నుంచి క్లాక్‌టవర్, పాన్ చౌరస్తా, పాత గంజ్, అశోక్‌టాకీస్ చౌరస్తా, బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ తదితర ప్రాంతాల్లో ముస్లింలతో షాపులన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా వస్త్రాలు, కాస్మోటిక్ వస్తువులు, మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, ధార్మిక పుస్తకాలైన ఖురాన్, జానీమాస్‌లు, గృహ పరికరాలతో పాటు రంజాన్ మాసం ప్రత్యేక వంటకం షీర్‌కుర్మా తయారీ కోసం ఉపయోగించే సేమియాలు, డ్రైఫ్రూట్స్ షాపుల వద్ద సందడి నెలకొంది.
స్టేషన్ మహబూబ్‌నగర్: శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు 30 రోజుల పాటు చేసిన ఉపవాసాలు విరమించారు. నేడు (శనివారం) జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మజీదుల్లో ఈద్–ఉల్–ఫితర్ పండుగను జరుపుకొని సర్వ మానవ కల్యాణం కోసం ప్రత్యేక నమాజు చేసి ప్రార్థనలు చేస్తారు. పేదలు, ధనికుల తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలను ధరించి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు. జిల్లా కేంద్రంలోని జామీయ మసీద్ నుంచి ఉదయం 8 గంటలకు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు రహెమానియా ఈద్గా వద్దకు చేరుకుంటారు. ఈద్గా వద్ద ఉదయం 9.30 గంటలకు జామియా మసీద్ ప్రధాన ఇమామ్ హాఫిజ్ మహ్మద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజు, సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకొని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శిబిరం వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు.
విక్రయానికి ఉంచి సేమియా, బాదం, పిస్తాలు


