● మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం
● ఉమ్మడి జిల్లాకు మరో కీలక పదవి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ విప్‌గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ విప్‌గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగాగెలిచారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఇద్దరికీ..
ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించారు. బీఆర్‌ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019లో బీఆర్‌ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించింది.


