మన్ననూర్: కొబ్బరి చెట్టు పై నుంచి పడి చెంచు యువకుడు మృతి చెందిన ఘటన అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో బుధవారం జరిగింది. వివరాల ప్రకారం.. మన్ననూర్‌లోని ఓ ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు నుంచి కాయలు కోసిస్తే డబ్బులు ఇస్తానని చెంచు యువకుడు కాళీదాసు(32) కు ఓ హోటల్ యజమాని చెప్పారు. దీంతో డబ్బులు వస్తాయనే ఆశతో కాళీదాసు చెట్టు ఎక్కి కొబ్బరి కాయలు కోస్తున్న క్రమంలో కాలు జారి కిందపడటంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సమీప బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా.. వివాహితురాలైన అక్క మాత్రమే ఉన్నారు. సదరు హోటల్ యజమానిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గ్రామస్తులు, పోలీసులను మృతుడి అక్క కోరారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
రాజోళి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని తూర్పుగార్లపాడుకు చెందిన తెలుగు వెంకటేష్ (58) చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం చేపలు విక్రయించేందుకు రాజోళిలోని చేపల మార్కెట్‌కు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. తూర్పుగార్లపాడు శివారులో ఉన్న కల్వర్టు వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం చనిపోయినట్లు ఎస్‌ఐ గోకారి తెలిపారు.
ఉరేసుకొని
వ్యక్తి బలవన్మరణం
వనపర్తి రూరల్: పట్టణ కేంద్రంలో నల్లవోతుల కృష్ణయ్య (45) బుధవారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాల్‌నగర్ కాలనీకి చెందిన కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


